Sep 23,2023 21:44

కోనేరు వద్ద ఏర్పాట్లను పరిశీలన చేస్తున్న వైసిపి ఇన్‌ఛార్జి దీపిక, ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ తదితరులు

         హిందూపురం : హిందూపురంలో ఏడు రోజుల పాటు వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. పట్టణ వ్యాప్తంగా 200 వరకు విగ్రహాలను ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అన్ని విగ్రహాలను పట్టణ పుర వీధుల గుండా పెద్ద ఎత్తున శోభయాత్రను నిర్వహించి, గుడ్డం కోనేరు వద్ద ఆదివారం నాడు నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనంకు అవసరమైన అన్ని ఏర్పాట్లు మున్సిపల్‌ శాఖ తరపున ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం నాడు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌తో కలిసి వైసిపి ఇన్‌ఛార్జి దీపిక, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజలు కోనేరు వద్ద పరిశీలన చేశారు. పోలీసులు సూచించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారంగా వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు నిమజ్జనం జరిగే కోనేరు వద్ద మున్సిపల్‌ శాఖ తరపున తగిన సిబ్బందిని, క్రేన్‌లను ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. దీంతో పాటు నిమజ్జనం తిలకించడానికి వచ్చే భక్తులకు సైతం తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్‌ శాఖ వారు పట్టణంలో ఎక్కడా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సిఐలకు సూచించారు.
భారీ బందోబస్తు
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని హిందూపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ, హిందూపురం డిఎస్‌పిల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్‌పి మాధవ రెడ్డి వన్‌టౌన్‌ స్టేషన్‌లో వినాయక మంటపాల నిర్వహకులతో పాటు సర్వమత పెద్దలతో శాంతి సంఘాలతో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు గుడ్డం కోనేరు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలన పరిశీలించారు. బందోబస్తు కార్యక్రమంలో ఆరు మంది డీఎస్పీలు, 20 మంది సీఐలతో పాటు ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌, హోమ్‌ గార్డు, ఏఆర్‌ సిబ్బంది, వంద మంది స్పెషల్‌ పార్టీ సిబ్బంది, ఏపీఎస్పీ సిబ్బందితో పాటు రెండు వజ్రవాహనాలతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో ఆదివారం వినాయక నిమజ్జనం సందర్బంగా పోలీసులు ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. నిమజ్జనం ముగిసే వరకు పట్టణంలో లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ చేయరాదన్నారు. కోట్నురు, ఆటోనరగ్‌, సేవా మందిరం, శ్రీకంఠపురం వైపు నుండి భారీ వాహనాలను అనుమతించడం లేదు. పరిగి వైపు నుంచి వచ్చే వాహనాలు శిరా హైవే మీదుగా, కోట్నురు వైపు నుంచి వచ్చే వాహనాలు పాలసముద్రం వైపు, శ్రీకంఠపురం నుంచి వచ్చే వాహనాలు చోళసముద్రం వైపు నుంచి మళ్లించారు.
అన్ని సౌకర్యాలు కల్పించండి
అధికారులకు సూచించిన ఇన్‌చార్జ్‌ దీపిక

వినాయక నిమజ్జనం సందర్బంగా పట్టణంలోని గుడ్డం కోనేరు వద్ద భక్తులకు అవసనమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని వైసిపి ఇన్‌చార్జ్‌ దీపిక అధికారులకు సూచించారు. శనివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, తహసీల్దార్‌ స్వర్ణలత, పట్టణ సిఐలతో పాటు ఇతర అధికారులతో కలిసి కోనేరును ఆమె పరిశీలన చేశారు. ఈ సందర్బంగా నిమజ్జనం కోసం వచ్చే వారితో పాటు తిలకించడానికి వస్తున్న భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా చూపడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ జబివుల్లా, కౌన్సిలర్లు షాజియా, రోషన్‌ ఆలీ, గిరి, వైసిపి నాయకులతో పాటు సిఐలు శ్రీనివాసులు, మున్సిపల్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.