Aug 19,2023 21:51

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
నేడు ప్రపంచ దోమల దినోత్సవం
ప్రజాశక్తి-నెల్లూరు:ఆడ ఎనాఫిలిస్‌ దోమ వల్ల మనిషికి మలేరియా వ్యాధి వస్తుందన్న విషయాన్ని సర్‌రోనాల్డ్‌ రాస్ని అనే శాస్త్రవేత్త 1879 ఆగష్టు 20వ తేదిన కనుగొన్నారని, ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగష్టు 20వ తేదిన ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.పెంచలయ్య అన్నారు. శనివారం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మలేరియా వ్యాధి మృతుల సంఖ్య గణణీయంగా నమోదు అవుతున్న నేపథ్యంలో సర్‌ రోనాల్డ్‌ రాస్ని అనే సైన్‌టిస్టు అనేక పరిశోదనలు నిర్వహించి మలేరియా వ్యాధి వ్యాప్తికి ఆడ ఎనాఫిలిస్‌ దోమ కారణమని గుర్తించారన్నారు. నాటి నుంచి నేటి వరకు మలేరియా వ్యాధి కట్టడి చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ కృషి చేస్తుందన్నారు. ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించేందుకు వ్యాక్సిన్‌ సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు.
జిల్లాలో మలేరియా కేసులు నమోదు కావడంలేదన్నారు. డెంగ్యూ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని, ఈ ఏడాది కేవలం 4 మలేరియా కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. గత ఏడాది డెంగ్యూ కేసులు 115 నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 96 కేసులు నమోదైయ్యాయన్నారు. దోమలు చిన్నవై అయినప్పటికీ వాటి వల్ల చాలా ప్రమాదర కలిగించేవిగా భావించి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమ కాటు నివారణ కంటే ముందుగా అవి పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్సుకరమన్నారు. వానలు కురిసిన సమయంలో దోమల సంతానోత్పత్తి ప్రారంభం అవుతుందని, నీరు నిల్వ ఉండే ప్రాంతంలోనే దోమలు పెరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వ్యర్థపు నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగానే ప్రైడే.. డ్రైడే కార్యక్రమం వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవ తప్పిదాల వల్లనే దోమల పెరుగుదల ఉంటుందన్నారు. జిల్లా మలేరియా నివారణాధికారిణి ఈ హుస్సేనమ్మ ఆధ్వర్యంలో శాస్త్రవేత్త సర్‌రోనాల్డ్‌ రాస్ని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.