ప్రజాశక్తి-చింతూరు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, గిరిజన, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చింతూరు మండల కేంద్రంలో సిపిఎం, సిసిఐ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేశారు. ఈ బహిరంగ సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావులపల్లి వెంకయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చింతూరులో రెండు కేంద్రాల నుండి భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం సాయంత్రం 4 గంటలకు చింతూరు పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వేలాది మందితో బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభలో బృందాకరత్, వెంకయ్యతో పాటు మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి జాతీయ చైర్మన్ డాక్టర్ మీడియం బాబురావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, ఇరు పార్టీల జిల్లా నాయకులు ప్రసంగించనున్నారని సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ తెలిపారు. ఈ బహిరంగ సభకు ప్రజలు అత్యధికంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. గ్యాస్ బండ రూ.1150కి చేరుకొని గుదిబండగా మారింది. ఫలితంగా ప్రజల బతుకులు దుర్భరంగా మారాయి. మరో వైపు ప్రజల ఆదాయం పెరగకపోగా, మరింత దిగజారింది. ఏడాదికి 3 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన మోడీ కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే విధానాలను అనుసరిస్తున్నారు. గ్రామీణ పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్న ఉపాధి హామీ చట్టానికి ప్రతి ఏటా నిధులు తగ్గిస్తూ దానిని నిర్వీర్యం చేస్తున్నారు. విద్యా వైద్యానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గిపోయాయి. మరో వైపు రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో సహా దేశానికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా ధారాదత్తం చేయడానికి పూనుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదు. గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలను సవరిస్తూ అడవులను కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ప్రశ్నించకుండా కులం, మతం, ప్రాంతం, ఆచార వ్యవహారాల పేరుతో విద్వేశాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు ఏప్రిల్ 14 నుండి ప్రచార భేరి నిర్వహించారు. దీని ముగింపు సందర్భంగా గురువారం చింతూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కేంద్ర విధానాలతో పాటు ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసి గిరిజన గ్రామాల్లో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని, అటవీ నివాసితుల హక్కుల గుర్తింపు చట్టం, 1/70, పీలా చట్టాల రక్షణ కల్పించాలని, నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఐదవ షెడ్యూల్లో చేర్చాలని వంటి డిమాండ్లను బలపర్చుతూ ఈ బహిరంగ సభలో వక్తలు ప్రసంగించనున్నారు.
జయప్రదం చేయండి : సిపిఎం
విఆర్.పురం : చింతూరులో గురువారం వామపక్షాలు అద్వర్యంలో జరుగుతున్న బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు విజ్ఞప్తి చేశారు. మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఒకే భాష, ఒకే విద్య, ఒకే మతం అంటూ బలవంతంగా ప్రజలపై మనువాదం భావజాలం రుద్దుతుందని, కట్టుకునే బట్ట తినేతిండిపై కూడా మోడీ సర్కార్ ఆంక్షలు విధిస్తుందని తెలిపారు. ఆదివాసీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను దెబ్బతీసే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అమాయక గిరిజనుల హృదయాల్లో విషాన్ని నింపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పంకు శ్రీరామ్మూర్తి, వడ్లది రమేష్, నల్లాపు ప్రకాష్ రావు పాల్గొన్నారు.
కూనవరం : చింతూరులో బహిరంగ సభకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఓ వివాహం నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గిరిజన హక్కుల కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పాల్గొన్నారు.










