Sep 14,2023 21:17

ప్రారంభానికి సిద్ధమైన మెడికల్‌ కళాశాల

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  రాష్ట్రంలో నెలకొల్పిన ఐదు మెడికల్‌ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించను న్నారు. విజయనగరం కళాశాలను నేరుగాను, మిగతా నాలుగు కళాశాలలను అక్కడి నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 17కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం విధితమే. వీటిలో విజయనగరం, ఏలూరు, నద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్‌ కళాశాల్లో ఈ ఏడాది మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌ కోర్సులకు గత నెలలో అడ్మిషన్లు నిర్వహిం చారు. విజయనగరం మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఇక్కడి నుంచి మిగిలిన నాలుగు కాలేజీలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సిఎం జగన్‌ శుక్రవారం విజయనగరం రానున్నారు. వైద్యరంగానికి రూ.16వేల కోట్లు కేటాయించగా, మెడికల్‌ కళాశాలల నిర్మాణానికే రూ.8,480కోట్లు కేటాయించినట్టు ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నేడు ప్రారంభించ బోతున్న కళాశాలలు ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు, ఆ తర్వాత సంవత్సరంలో మిగిలిన తొమ్మిది కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2,185 సీట్లు ఉండగా కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్‌ కాలేజీల్లో 150 చొప్పున మొత్తం 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరానికి 150సీట్లు కూడా మంజూరయ్యాయి. జులై 15నుంచి కౌన్సిలింగ్‌ చేపట్టగా, విజయనగరంలో 114 సీట్లు భర్తీ అయినట్లు సమాచారం. కళాశాల ఏర్పాటుతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినవారెందరో వైద్య వృత్తి చదుకునేందుకు అవకాశం దొరుకుతుందని ఎంతో ఆశపడ్డారు. కానీ, కొత్త వైద్య కళాశాలల్లో 50శాతం సీట్లు విక్రయానికి పెడుతూ వైద్యారోగ్యశాఖ 107, 108 జీవోలు విడుదల చేయడంతో సామాన్యుల ఆశలపై నీళ్లు జల్లినట్టుగా అయ్యింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మెడికల్‌ కాలేజీకి కేటాయించిన 150సీట్లలో 15శాతం సీట్లను ఆలిండియా కోటాలో కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో 128 లేదా 129 సీట్లలో 50శాతం సీట్లు మాత్రమే ప్రభుత్వ కోటా కింద కేటాయిస్తారు. మిగతా 50శాతంలో 35శాతం సెల్ఫ్‌ఫైనాన్స్‌ కింద, 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయిస్తారు. దీన్నిబట్టి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి 64 లేదా 65సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా సీట్లను రూ.12లక్షలకు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రూ.20లక్షల చొప్పున ఫీజు విధించారు. దీంతో, వైద్య వృత్తిచేయాలని కలలు కంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమౌతోంది.
విజయనగరంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌ విద్యార్థులకు అనాటమీ, హిస్టాలజీ, స్కిల్‌ ల్యాబ్‌లు, అవసరమైన తరగతి గదులు, ల్యాబ్స్‌, పరిపాలనా విభాగం, హాస్టల్‌ భవనం, ప్రొఫెసర్‌ ఛాంబర్లు వంటివి సిద్ధం చేశారు. కళాశాల మొత్తానికి 222 మంది ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 150పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన పోస్టుల్లో కొన్ని రాష్ట్ర కేంద్రం, మరికొన్ని రీజనల్‌, ఇంకొన్ని కళాశాల స్థాయిలో భర్తీ చేయాల్సి వుంది.