ప్రజాశక్తి-పాడేరు: గిరిజన సంక్షేమ శాఖలోని విద్యా రంగ సమస్యల పరిష్కారానికై అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో ఈనెల 20న ఆదివారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును నిర్వహిస్తోంది. గత అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏల పరిధిలో యుటిఎఫ్ జీపుజాతా నిర్వహించింది. కొన్నేళ్లుగా గిరిజన విద్యా రంగంలో అపరిస్కతంగా ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా గుర్తించింది. ఈ సమస్యలపై విద్యా సదస్సులో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అసౌకర్యాల నడుమ ఆశ్రమాలు
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అసౌకర్యాల నడుమ గిరిజన విద్యార్థులకు విద్యాబోధన సాగుతోంది. గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో విద్యార్థులకు 2019 నాటి మెస్ చార్జీలే ఇప్పటికీ ప్రభుత్వం చెల్లిస్తోంది. గత మూడున్నర ఏళ్లలో నిత్యావసరాల ధరలు అన్ని రెట్టింపైనా గిరి విద్యార్థుల మెస్ ఛార్జీలు ప్రభుత్వం పెంపుదల చేయలేదు. కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులకు పంపిణీ చేసే నోట్స్ పుస్తకాలు, దుస్తులను సగానికి కుదించింది. ఆశ్రమాల్లో వాచ్‌మెన్, కుక్, కమాటి, ఏఎన్‌ఎం, హెల్త్‌వర్కర్ల నియామకాలు చేపట్టలేదు. విద్యార్థులకు అనారోగ్యం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాహన సదుపాయాలు అందుబాటులో లేవు. హాస్టల్స్‌లో వండి పెట్టేవారు కరువై విద్యార్థులు అర్ధాకలితో గడుపుతున్నారు.
సమస్యల నడుమ ఉపాధ్యాయులు
గిరిజన సంక్షేమ (విద్య) శాఖలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. గిరిజన ఆశ్రమాల్లో బోధనేతర సిబ్బంది కొరతతో ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్, హెల్త్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, చివరికి కుక్కు, కమాటీలు చేసే పనులు కూడా నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులే డిప్యూటీ వార్డెన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కుక్, కమాటిలను తమ సొంత ఖర్చుతో నియమించు కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం ఎదురైనా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. జీవో 3 అమల్లో లేక ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డీఈవో వంటి పోస్టులలో సీనియారిటీ ఉన్న అర్హులైన గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించ లేదు. పండిట్, పిఈటి అప్ గ్రేడేషన్ సమస్య పరిష్కారం కాలేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసే ఊసే లేదు. ఉన్న వసతి గృహాలు శిథిలమై మరమ్మతులకు నోచుకో లేదు. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో భాషా వాలంటీర్ల నియమకాలు ఆపేశారు. గిరిజన సిఆర్టిల రెగ్యులరైజేషన్ తో పాటు పాఠశాలల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ఉపాధ్యాయులను ఐక్య పరిచేందుకు యుటిఎఫ్ ఈ విద్యా సదస్సును తలపెట్టింది.
గిరిజన విద్యారంగ సమస్యలపై ఈనెల 20న ఆదివారం ఉదయం 10 గంటలకు పాడేరు కాఫీ హౌస్ లో నిర్వహిస్తున్న విద్యా సదస్సు ఏర్పాట్లను యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకే ఈ విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సదస్సును పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్‌జి, మరో పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు కూడా హాజరవుతున్నారని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను నుంచి 14 ఐటిడీఏల పరిధిలో ఉన్న సుమారు 500 మంది ఉపాధ్యాయ ప్రతినిధులు ఈ విద్యా సదస్సుకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి అప్పలనరస, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి మహేశ్వరరావు, మాజీ కార్యదర్శి డి.రాము, అల్లూరి జిల్లా యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.










