ప్రజాశక్తి-కాకినాడ ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా గురువారం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రెవెన్యూ, ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 రూపకల్పనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న కార్యకలాపాలు, ఇవిఎంల తొలి దశ తనిఖీ వంటి అంశాలను కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. 2024-జనవరి 5న తుది ఓటరు జాబితా ముద్రించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి దశ ఇవిఎం తనిఖీ ప్రక్రియ ఈ నెల 16 నుంచి కాకినాడ అంబేద్కర్ భవన్‌లో ప్రారంభమైయిందని ఇప్పటివరకు 50 శాతం ఇవిఎంల తనిఖీ పూర్తయిందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య ఈ తనిఖీ ప్రక్రియ అంతా సవ్యంగా సాగుతుందని, నవంబర్ 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.శ్రీధర్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు (వైసిపి), చోడిశెట్టి రమేష్ బాబు (బిజెపి), గదులు సాయి బాబా(టిడిపి), ఆకుల వెంకట రమణ(ఐఎన్‌సి), సబ్బారపు అప్పారావు(బిఎస్‌పి), అతికంశెట్టి సత్యనారాయణ రావు (ఆప్), కలెక్టరేట్ ఎన్నికల డిటి ఎం.జగన్నాథం పాల్గొన్నారు.










