May 28,2023 23:35

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరెడ్డి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : జివిఎంసి పారిశుధ్య విభాగంలో 482 పోస్టుల భర్తీలో కార్మికుల వారసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నప్పటికీ అధికారులు కుట్రపూరిత వైఖరి అవలంభిస్తున్నారని, ఈ చర్యకు నిరసనగా సోమవారం జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన టోకెన్‌ సమ్మె నిర్వహించనున్నట్లు ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి తెలిపారు. జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్లాప్‌ డ్రైవర్లు, మలేరియా, వెటర్నరీ, నీటిసరఫరా, యుజిడి, పార్కుల్లో పనిచేసే కార్మికులకు సెమి స్కిల్డ్‌ వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే జూన్‌ 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
కరోనా కాలంలో కూడా ప్రజల ఆరోగ్యాల కోసం తమ ప్రాణాలను తెగించి పనిచేసారని గుర్తుచేశారు. అటువంటి కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించకపోవడం, పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు సెమీ స్కిల్డ్‌, స్కిల్డ్‌ వేతనాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. 25 ఏళ్ళకు పైగా సేవలందించిన పారిశుధ్య కార్మికులు విరమణ పొందినా, ప్రమాదంలో అంగవైకల్యానికి గురైనా, మృతిచెందినా పర్మినెంట్‌ కార్మికుల వలే ఒక్క రూపాయి కూడా వీరికి నష్టపరిహారం రాదన్నారు. అటువంటి కార్మికుల వారసులకు చెందాల్సిన డెత్‌, రిటైర్డ్‌, లాంగ్‌ ఆబ్సెంట్‌ పిల్లలకు ఎందుకు ఉపాధి కల్పించరని ప్రశ్నించారు. 482 పోస్టులు ఖాళీలైతే వాటి స్థానంలో వారి పిల్లలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జివిఎంసి స్క్రూట్నీ కమిటీ ఫైనల్‌ చేసిన 316 పోస్టులకు గాను 77 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కమిషనర్‌ చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికే 300 మందిని టెంపరరీ పేరుతో వేసుకున్నారని, వీరు టెంపరరీ అయితే పర్మినెంట్‌ కార్మికుల వలే ఫేషియల్‌ రీడింగ్‌ ఎలా తీస్తారని ప్రశ్నించారు. పోస్టులు అమ్ముకుంటున్నారని సిఐటియు లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారణ చేయలేదని, కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఎందుకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారని, ఏ అర్హతలు ఉన్నాయని 300 మందిని కమిషనర్‌ తీసుకున్నారని ప్రశ్నించారు. సిఎం బంధువులమని చెప్పుకుంటున్న క్లాప్‌ కాంట్రాక్టర్లు బ్రోకర్ల ద్వారా డ్రైవర్ల నుంచి వసూలు చేసిన డిపాజిట్‌ డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ వివక్ష లేకుండా జీవో 7 ప్రకారం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదన్నారు. పైగా కార్మికుల హక్కుల కోసం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సిఐటియు నేత పి.వెంకటరెడ్డి గొంతు నొక్కటానికి కుట్రపూరితంగా ఒక దళిత డ్వాక్రా మహిళా చేత అవినీతి ఆరోపణలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారన్నారు. దీని వెనక ఎవరున్నారో తేలే వరకు సిఐటియు విశ్రమించదన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చే ప్రతిసారీ ప్రభుత్వ జీవోలు, ఉత్తర్వులు అమలు చేస్తామని రాత పూర్వకంగా హామీ ఇస్తున్నారు, కానీ అమలు చేయడం లేదన్నారు. పబ్లిక్‌ హెల్త్‌, ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలపై అంగీకరించిన అంశాలన్నింటినీ నిర్ణీత కాలపరిమితితో పరిష్కరించడానికి అంగీకరించే వరకు నిరవధిక సమ్మెలోకి వెళ్తామని స్పష్టంచేశారు. మున్సిపల్‌ కార్మికుల పోరాటానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు వి.కృష్ణారావు, గొలగాని అప్పారావు, ఎస్‌.గణేష్‌, శంకర్‌ రెడ్డి, అనిల్‌, సురేష్‌ పాల్గొన్నారు.