ప్రజాశక్తి-యంత్రాంగం
మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. తీవ్రంగా ఖండిస్తూ.. ఆ రాష్ట్రంలోని బిరేన్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి గిరిజన సంఘాలు సంయుక్తంగా ఈనెల 3న గురువారం మన్యం బంద్ చేపట్టనున్నాయి. అల్లూరి జిల్లాలో బంద్‌ను నిర్వహించేందుకు పలు గిరిజన సంఘాలు సమాయత్తమయ్యాయి. ఈ మేరకు జిల్లాలో విస్తృతంగా బుధవారం ప్రచారం చేపట్టాయి
పాడేరు: జిల్లా వ్యాప్తంగా ఆదివాసి గిరిజన సంఘం గిరిజన సమాఖ్య డిఎల్‌ఓ అనుబంధ సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ ఏఐఎస్‌ఎఫ,్ సిఐటియు, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి.గత రెండు రోజులుగా జిల్లాలో బంద్ నిర్వహణపై అన్ని వర్గాల ప్రజలకు సమాచారమిచ్చి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని గిరిజన సంఘాలు పిలుపు నిచ్చాయి. బంద్ నిర్వహణపై బుధవారం పాడేరు జిల్లా కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య నేతలు ఆర్టీసీ డిపో మేనేజర్, బ్యాంక్ మేనేజర్లు విద్యా సంస్థలు, వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థల్ని ప్రత్యేకంగా కలిసి బంద్‌కు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎల్ సుందర్రావు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మువ్వల లక్ష్మణరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నాయకులు చిన్నారావు, బొజ్జయ్య తదితరులు పాల్గొన్నారు.
అరకులోయలో బైక్ ర్యాలీ
అరకులోయ రూరల్:మణిపూర్ ఆదివాసులపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాల నిరసిస్తూ చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని అరకువేలిలో ఆదివాసీ గిరిజన సంఘం, దండ కారణ్య విమోచన సమితి, ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, మణిపూర్ 60 వేల మంది ఆదివాసులు పునారవాస కేంద్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో కుకి, నాగ తెగల ఆదివాసులకు రక్షణ కల్పించాలని, జరుగుతున్న దాడి ఆపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానం తక్షణమే రద్దు చేయాలన్నారు. దీనిపై గిరిజన ప్రజాప్రతీనిదులైన ఎంపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం రద్దు చేసే విధంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి పి రామన్న, మండల ఉపాధ్యక్షులు బి.దశరథ, ఉపాధ్యక్షులు కె రామారావు, దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర జిల్లా నాయకులు కొర్ర ప్రసన్నకుమార్, జాన్ బాబు, రమేష్ కుమార్, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు మధు, మార్కండే, అప్పలస్వామి, నిరంజన్, అంజలిరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:మన్యం బంద్‌లో ఉద్యోగ, ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. జెడ్పిటిసి దీసరి గంగరాజు, సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నాగులు బృందాలుగా ఏర్పడి ప్రచారం చేశారు. జెడ్పిటిసి గంగరాజు బృందం అనంతగిరి, ములియగుడ, బొర్రాగుహలు, డమ్ముకు వారపు సంతల్లో ప్రచారం చేశారు. మరో బృందం కాశీపట్నం వారపు సంతతో పాటు శివలింగపురం, కొత్తూరు, చిలకలగెడ్డ ప్రాంతంలో వ్యాపార దుకాణాలు, హౌటల్స్ నిర్వాహకులను కలిశారు. ఆర్టీసీ రవాణా నిలిపివేసి బందుకు సహకరించాలని విజయనగరం జిల్లా ఎస్.కోట ఆర్టీసీ డిపో అధికారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు సివేరి. కొండలరావు, మండల కమిటీ నాయకులు ఎం.కృష్ణ, జన్ని.రామన్న తదితరులు పాల్గొన్నారు
సంపూర్ణ మద్దతు
ముంచింగిపుట్టు:3న చేపట్టే బందుకు అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) మండల అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరి, విజయలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ, మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం దుర్మార్గమన్నారు. ఆదివాసీల మనుగడను దెబ్బ తీసేందుకు బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తూ వైసిపి ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలని, ఆదివాసి హక్కులు చట్టాలు, రిజర్వేషన్ల కాపాడాలని కోరారు.
డుంబ్రిగుడ:మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో యూనియన్ బ్యాంకు, పెట్రోల్ బంక్, కిరాణా దుకాణాల్లో కరపత్రాలు పంచుతూ విస్తతంగా ప్రచారం చేపట్టారు. అరుకు, కించమండలో కూడా ప్రచారం నిర్వహించి ప్రైవేట్ వాహనదారులు బంద్ కు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్పీ పోతురాజు, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు టి సూర్యనారాయణ, పి.సురేష్, పి.సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు:మహిళలపై జరుగుతున్న హింస కాండను ప్రతిఒక్కరు ఖండించాలని, మన్యం బందు విజయవంతం చేయాలనీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మండల అధ్యక్షురాలు టి.కౌసల్య ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, ఆదివాసీ మహిళలపై రోజు రోజుకు హింసాకాండ పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయన్నారు.మహిళలను హింసిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.










