Apr 11,2023 00:19

ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దుర్మార్గమైన దాడులను అరికట్టాలని, దాడులపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలని నేడు సిపిఎం ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే 196వ జయంతిని పురస్కరించుకొని మండుటెండలో 'ఫూలే దీక్ష' నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. దీక్షలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. తొలుత ఉదయం 10 గంటలకు మార్కెట్‌ సెంటర్‌లోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి వి.శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని, అనంత రం అక్కడి నుండి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ పాదయాత్ర నిర్వహిస్తారని, తర్వాత 11 గంటలకు ఎండలో నిరసన దీక్ష చేపడతారని వివరించారు. దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు, ప్రజలు దీక్షల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కడపలో పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్చన్న హత్య, కాకినాడ జిల్లా శృంగవృక్షంలో తొండంగి దళిత యువకుడు నడిపల్లి రాము హత్య, నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో దళిత కౌలురైతు తలారి రవికుమార్‌పై దాడులు అక్రమ కేసులు, వైసిపి నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య, వాకపల్లి గిరిజన మహిళలకు జరిగిన అన్యాయం వంటి సంఘటనలు రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని అనడానికి తార్కాణాలని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిందితులకే కొమ్ముగా స్తున్నాయని, దళిత, గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఈ ఘటనలపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న దీక్షలో దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు, ప్రజలూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.