ప్రజాశక్తి - కలెక్టరేట్ : హింసపై మహిళల పోరాటయాత్ర రాష్ట్ర జాత జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం శుక్రవారం పార్వతీపురంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మత్తు పదార్థాలు నియంత్రిస్తానని ఎన్నికలు ముందు హామీ ఇచ్చిందని ఆ హామీ నెరవేకపోగా మద్యమే ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తుందని అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ హింస రోజురోజుకు పెరుగుతుందని, ఢిల్లీలో మహిళా మల్లయోధులు చేసిన ఆందోళన ఇందుకు నిదర్శనం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల హింసను అరికట్టే వరకు ఐద్వా పోరాటయాత్ర కొనసాగిస్తుందని అన్నారు. జిల్లాలో శనివారం పాలకొండ, పార్వతీపురం, సీతానగరం, సాలూరులో రాష్ట్ర జాతా వస్తుందని అన్నారు. ఈ జాతలో మహిళలు, అభ్యుదయవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం గౌరీ, జయలక్ష్మి, వి.ఇందిర, జి.తులసి తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్: ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర జీపు యాత్ర జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.హిమప్రభ కోరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మహిళలపై రోజు రోజుకు హింస పెరుగు తున్నందున దీనిపై ఐద్వా పోరు చేస్తూ మహిళల్లో చైతన్యం నింపుతూ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తెలియజేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వడమ రోడ్డులో గల శ్రీవాసవి తిరుమల కల్యాణ మండపంలో జరిగే సమావేశానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టి.మెరీనా, బి.శాంతకుమారి, యు.పద్మ, బి.రాజేశ్వరి, బి.అమరవెణి, జి.జెస్సీ భాయి, జి.శారద తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్: మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింస పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యాన జరుగుతున్న పోరుయాత్ర ప్రచార కరపత్రాన్ని ఐద్వా నాయకులు మామిడిపల్లిలో విడుదల చేశారు. ఈ పోరు యాత్ర ఆదివారం సాలూరు పట్టణానికి వస్తుందని, ఇందులో మహిళలంతా పాల్గొనాలని ఐద్వా నాయకులు ఎ.నారాయణమ్మ, ఎం.కుమారి, జానకి పిలుపునిచ్చారు.










