
* విజయవంతం చేయాలి అఖిలపక్ష రైతు, కార్మిక సంఘాల నాయకుల పిలుపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో ఈనెల ఆరో తేదీన నిర్వహించే కార్మిక, కర్షక సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అఖిలపక్ష రైతు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. దేశవ్యాప్త కార్మిక, కర్షక సంఘీభావ దినం సందర్భంగా వెయ్యి రోజుల విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలపాలని పిలుపునిచ్చారు. కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న న్యూస్ క్లిక్ పోర్టల్‌పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ప్రత్యేకించి సంయుక్త కిసాన్ మోర్చా నడిపిన రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలబడిందన్న కారణంగా కక్షసాదింపు చర్యలకు పూనుకుందని విమర్శించారు. న్యూస్ క్లిక్‌పై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్‌ఐఆర్ కాపీలను తగులబెట్టాలని పిలుపులో భాగంగా ఉదయం పది గంటలకు అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో రైతులు, కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి డి.గణేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.