నూజివీడు మండలం మీర్జాపురంలో ప్రవేశం
మూడు రోజులు నూజివీడు నియోజకవర్గంలోనే యాత్ర
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలోకి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రవేశించనుంది. లోకేష్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. 24వ తేదీ గురువారం సాయంత్రం మీర్జాపురం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి గ్రామ శివార్లలో ఎంఎన్‌కె రహదారి పక్కన రాత్రి బస చేయనున్నారు. 25వ తేదీ శుక్రవారం ఉదయం సమీపంలోని పామాయిల్ తోటలో మామిడి రైతులతో సమావేశం జరగనుంది. అనంతరం గొల్లపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమై మోర్సపూడి, తక్కులూరు గ్రామాల మీదుగా సాగనుంది. మధ్యాహ్నం భోజనం నూజివీడు సరస్వతీదేవి ఆలయ సమీపంలో ఏర్పాటు చేశారు. అనంతరం నూజివీడు పట్టణలో చిన్న గాంధీబొమ్మ సెంటర్, పొట్టి శ్రీరాములు బొమ్మసెంటర్, పెద్దగాంధీ బొమ్మసెంటర్, పోస్టాఫీస్ రోడ్డు, టిటిడి కల్యాణ మండపం మీదుగా ఎంప్లాయీస్ కాలనీ నుంచి మూడుపల్లి తాతయ్య బాబు జూనియర్ కాలేజీ, వెంచర్, బైపాస్‌రోడ్డు మీదుగా పోతిరెడ్డిపల్లి గ్రామం వరకూ సాగి రాత్రికి అక్కడ బస చేయనున్నారు. 26వ తేదీ శనివారం ఉదయం పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి సింహాద్రిపురం, ముసునూరు మీదుగా వలసపల్లి గ్రామం వరకూ సాగనుంది. మధ్యాహ్నా భోజన విరామం అనంతరం వలసపల్లి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. లోకేష్ పాదయాత్రకు సంబంధించి టిడిపి నాయకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. నూజివీడు నియోజకవర్గ అనంతరం చింతలపూడి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. చింతలపూడిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు రావాల్సి ఉంది.










