Nov 04,2023 23:35

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర ఈ నెల 5 నుంచి జిల్లాలో రెండు రోజుల పాటు జరగనుంది. శ్రీకాకుళం జిల్లా మందస నుంచి బయలుదేరిన యాత్ర ఆదివారం సాయంత్రం జిల్లా పరిధిలోని తునికి చేరుకుంటుంది. అక్కడ స్వాగతం కార్యక్రమం అనంతరం అన్నవరం, కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు మీదుగా సాయంత్రం 5 గంటల సమయానికి పిఠాపురం వస్తుంది. అక్కడ ఉప్పాడ బస్టాండ్‌ సమీపంలో బహిరంగ సభ జరగనుంది. ఆ తర్వాత కాకినాడ రూరల్‌ తిమ్మాపురం, సర్పవరం మీదుగా బానుగుడి జంక్షన్‌, అనంతరం సాయంత్రం 6 గంటలకు కాకినాడ అంబేడ్కర్‌ విగ్రహ సమీపంలో ఉన్న ట్యాక్సీ స్టాండ్‌ వద్దకు చేరుకుంటుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో వివిధ కళా రూపాలు ప్రదర్శిస్తారు. 6న కాకినాడ నుంచి సామర్లకోట చేరుకునే యాత్రకు అక్కడ భారీ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి పెద్దాపురంలో మధ్యాహ్నం 1గంటకు బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ నుంచి రాజానగరం మీదుగా సాయంత్రం రాజమండ్రి చేరుకుంటుంది. ఈ సందర్భంగా యాత్ర పొడవునా రాష్ట్ర, జిల్లా సమగ్రాభివద్ధికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూనే, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో బాటు, సిపిఎం సూచించిన ప్రత్యామ్నాయాలను నేతలు వివరించనున్నారు.
విస్తృత ప్రచారం
ప్రజారక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర నేపథ్యంలో జిల్లాలో సుమారు నెల రోజులుగా పార్టీ శ్రేణులు విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ యాత్రకు సంబంధించి ప్రచారాలు బాగా జరిపారు. కాకినాడ నగరంలో శనివారం ఆటో ప్రచారం నగరంలో ప్రారంభమైంది. కాకినాడ, కాకినాడ రూరల్‌, తాళ్లరేవు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, యు. కొత్తపల్లి, తుని, ప్రత్తిపాడు తదితర మండలాల్లో కరపత్రాలు, గోడపత్రికలు ముద్రించి అన్ని ప్రాంతాల్లోనూ పంచారు. అన్ని రంగాల ప్రజలతో సీపీఎం, ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యి యాత్రను జయప్రదం చేయాలని కోరారు.