May 25,2023 23:51

సమావేశానికి హాజరైన కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఇఎస్‌ఐలో మెరుగైన వైద్యం కోసం ఈనెల 26న మల్కాపురం ఆసుపత్రి వద్ద ధర్నాను జయప్రదం చేయాలని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌, సిఐటియు గౌరవాధ్యక్షులు. ఒవి రావు ఉక్కు కాంట్రాక్టు కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం ఎల్‌ఎంఎంఎం పార్కులో నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇఎస్‌ఐలో వైద్యసేవలు తీసికట్టుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా రిఫరల్‌ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో ఆసుపత్రుల్లో వైద్యం నిలిచిపోయిందన్నారు. రోగులకు కావాల్సిన మందులు బయటకొనుక్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇఎస్‌ఐలో రూ.21వేలకు సీలింగ్‌ ఉండడంతో స్టీల్‌ ప్లాంట్‌లో 3426 మంది స్కిల్డు కార్మికులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. కేంద్ర.రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలుగజేసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ అధ్యక్షులు జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు నమ్మి రమణ, చట్టి నర్సింగరావు, పి మసేను, పి వరహాలు, ఎన్‌.కృష్ణ, యు సోమేష్‌, కెపి సుబ్రహ్మణ్యం, పి నారాయణరావు పాల్గొన్నారు.