ప్రజాశక్తి - భీమడోలు
ఏలూరు కాలువపై గుండుగొలను వద్ద నూతనంగా నిర్మించిన బెయిలీ వంతెనను ఈ నెల 25న ప్రారంభిస్తున్నట్లు పంచాయతీ ఉప సర్పంచి, వైసిపి నాయకులు ముదుండి సూర్యనారాయణరాజు తెలిపారు. ఉంగుటూరు, దెందులూరు ఎంఎల్‌ఎలు పుప్పాల వాసుబాబు, కొఠారు అబ్బయ్యచౌదరితో పాటు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారని తెలిపారు. వంతెన ముగింపు పనులను ఉపసర్పంచి గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వంతెన కూలిన వెంటనే స్పందించిన ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు పెనుగొండ ప్రాంతంలోని బెయిలీ వంతెనను గుండుగొలను తీసుకువచ్చి పున:నిర్మాణానికి అవసరమైన రూ.46.70 లక్షల మంజూరుకు కృషి చేశారన్నారు. పనుల వేగవంతానికి సహాయ సహకారాలు అందజేశారని తెలిపారు. వంతెన నిర్మాణ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఎపి రోడ్లు అభివృద్ధి కమిషన్ ఛైర్మన్ కె.సుబ్బరాజు తన వంతు సహకారాన్ని అందజేశారన్నారు. 73 రోజుల్లో ఈ బెయిలీ వంతెన నిర్మాణం పూర్తయిందన్నారు.










