
ప్రజాశక్తి-గుంటూరు : విద్యారంగంలో నెలకొన్న సమస్యలును పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నేడు చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో చలో విజయవాడ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తారనుకున్నాం కానీ ఎటువంటి చర్చ లేకుండా సమావేశాలు ముగిశాయని అన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలని, జీవో 77ని రద్దుచేసి పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన వర్తింప చేయాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై నిర్వహించే చలో విజయవాడకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, ఎస్.కె.సమీర్, నాయకులు యశ్వంత్, వంశి పాల్గొన్నారు.