Mar 15,2023 21:32

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం
ఐదు టేబుళ్లు ఏర్పాటు : లెక్కించాల్సిన ఓట్లు 1,088
బరిలో ఆరుగురు అభ్యర్థులు
మధ్యాహ్ననికి లెక్కింపు పూర్తయ్యే అవకాశం
స్వపక్ష ప్రజాప్రతినిధులకే డబ్బు పంపిణీపై సర్వత్రా చర్చ
ఓట్ల చీలికపై లోలోన వీడని టెన్షన్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. ఏలూరు ఎంపిడిఒ కార్యాలయంలో కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటలకు ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి అనంతరం లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట కౌంటింగ్‌ టేబుళ్ల వద్ద, తదుపరి రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి మొత్తం 1,105 ఓట్లకుగాను ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో 1,088 ఓట్లు పోలయ్యాయి. ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రాధాన్యతా ఓటు ఆధారంగా సాగనుంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లను ముందుగా పక్కన పెడతారు. తర్వాత రెండో ప్రాధాన్యత ఓటు, తర్వాత మూడో ప్రాధాన్యత ఇలా వేరు చేసి కట్టలు కట్టి ఓట్ల లెక్కింపు సాగిస్తారు. పోలైన ఓట్లలో 50 శాతం అంటే 545 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లు 50 శాతం దాటకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించి గెలుపును ప్రకటిస్తారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1,105కుగాను దాదాపు 920 మంది వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులే ఉన్నారు. 185 మంది టిడిపి, జనసేన, స్వతంత్రులు ఉన్నారు. మొత్తం ఓట్లలో 17 ఓట్లు పోలు కాలేదు. దీనిలో బుట్టాయగూడెం, వేలేరుపాడు లోని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన నలుగురు స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మిగిలిన 13 మంది వైసిపికి చెందిన వారే ఎక్కువ ఉన్నారు. పోలైన ఓట్ల ప్రకారం చూస్తే వైసిపి అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాధ్‌ సునాయాసంగా గెలిచే పరిస్థితి ఉంది. గెలుపుపోటముల సంగతి పక్కన పెడితే క్రాస్‌ ఓటింగ్‌పై మాత్రం వైసిపిలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.
సొంత ప్రజాప్రతినిధులకే డబ్బు పంపిణీ దేనికి సంకేతం!
జిల్లాలోని స్థానిక సంస్థలకు చెందిన రెండు ఎంఎల్‌సి స్థానాలు వైసిపికి ఏకగ్రీవంగా దక్కాలి. అయితే టిడిపికి చెందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వీరిలో వీరవల్లి చంద్రశేఖర్‌కు టిడిపి అధికారికంగా మద్దతు ప్రకటించడంతో ప్రధాన పోటీదారుగా నిలిచారు. సర్పంచుల ఛాంబర్‌ సైతం టిడిపి మద్దతు పలికిన చంద్రశేఖర్‌కు మద్దతు పలికింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు 185 మందితోపాటు అధికార పార్టీకి చెందిన మరో 150 నుంచి 200 ఓట్లు చీలితే ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. స్థానిక సంస్థలకు నిధులివ్వకపోవడం, కాంట్రాక్టులు చేసిన బిల్లులు ఇవ్వకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో ఎంఎల్‌సి ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. ఓటుకు నోటు ఇస్తేనే వైసిపి అభ్యర్థులకు ఓటు వేస్తామని ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులే తేల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో వైసిపి నాయకుల్లో భయం పట్టుకుంది. బలం ఉండి ఓడిపోతే రాజకీయంగా ఎదురుదెబ్బ తప్పదని ఆందోళన గురైన పరిస్థితి ఏర్పడింది. ఓటమి భయంతో సొంత వైసిపి ప్రజాప్రతినిధులకే ఓటుకు రూ.20 వేలు చొప్పున పంపిణీ చేయాల్సి వచ్చింది. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకే డబ్బు పంపిణీ చేయడం దేనికి సంకేతమనే చర్చ నడుస్తోంది. ప్రతిపక్ష, స్వతంత్ర స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా పలుచోట్ల అధికార పార్టీ డబ్బు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ వైసిపి నాయకుల్లో క్రాస్‌ ఓటింగ్‌ టెన్షన్‌ మాత్రం వీడలేదు. మొదటి ప్రాధాన్యతా ఓటు వైసిపి అభ్యర్థికి వేసి రెండో ప్రాధాన్యతా ఓటు టిడిపి బలపరిచిన అభ్యర్థికి వేస్తే పరిస్థితి ఏమిటనే భయం వెంటాడుతోంది. వైసిపి అభ్యర్థుల గెలుపుపై ఎటువంటి అనుమానాలు లేకపోయినప్పటికీ ఓట్ల చీలికపై ఆందోళన మాత్రం వైసిపిని వెంటాడుతోంది.
ఏర్పాట్లన్నీ పూర్తి
పి.అరుణ్‌బాబు, రిటర్నింగ్‌ అధికారి
స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఉదయం 7 గంటలకు ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల సంఘం నిబంధనలపై ఇప్పటికే సిబ్బందికి రెండుసార్లు శిక్షణ ఇచ్చాం. కౌంటింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.