Aug 28,2023 23:47

ట్రయల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న వీసీ పి.రాజశేఖర్‌

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 39వ, 40వ వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా వర్సిటీకి ఛాన్సలర్‌ అయిన రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం రానున్నారని వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలతో వీసీ సోమవారం సమావేశమై ట్రయల్‌ నిర్వహించారు. స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ పట్టాలు, బంగారు పతకాలను ఛాన్సలర్‌ అందజేయనున్నారని తెలిపారు. మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో 'నాక్‌' డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గణేశన్‌ కన్నాభిరాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటాన్నారు. జర్నలిజం, సాహిత్యం, కమ్యూనికేషన్‌ రంగాల్లో విశేష అనుభవం గడించి, 2007లో రామన్‌ మెగసెసే పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడు పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేస్తామని, గౌరవ అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్‌ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, దూర విద్యాకేంద్ర సంచాలకులు బి.నాగరాజు, ప్రొఫెసర్‌ కె.మధుబాబు, ప్రిన్సిపాళ్లు కె.గంగాధర్‌, సిహెచ్‌.స్వరూపరాణి, పి.సిద్ధయ్య, జాన్సన్‌, ఇ.శ్రీనివాసరెడ్డి, వర్సిటీ ఇంజినీర్‌ కుమార్‌రాజా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.