Nov 14,2023 23:52

విజయవాడ నగరంలోని ఓ కూడలిలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : అసమానతలు లేని అభివృద్ధి నినాదంతో బుధవారం విజయవాడ సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ప్రజారక్షణ భేరి సభకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సిపిఎం శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లనున్నాయి. లౌకికతత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తామని, సిపిఎం ప్రజా ప్రణాళికను బలపర్చాలని కోరుతూ ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా ప్రణాళికను ఎందుకు అమలు చేయకూడదో పాలక పార్టీని ప్రశ్నించండి.. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రజా ప్రణాళికను ఎందుకు పెట్టకూడదో ప్రతిపక్షాన్ని నిలదీయండి.. మతోన్మాద, ధనస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎంను బలపరచండి... తదితర నినాదాలతో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ర్యాలీగా సభా స్థలికి చేరుకోనున్నారు. విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డు నుంచి సభాస్థలి వరకు ర్యాలీ జరగనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వివిధ అంశాలపై ప్రజలను చైతన్య వంతం చేస్తూ ప్రజారక్షణ భేరి యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర రాజకీయ ప్రచార జాతా ఈనెల 7, 8, 9 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. 9వ తేదీ రాత్రి ఉండవల్లిలో ముగిసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన పాలకుల తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోని నుంచి ప్రారంభం అయిన బస్సు యాత్ర మూడు రోజులపాటు జిల్లాలో జరిగింది. మరోవైపు ప్రజారక్షణ భేరి యాత్ర విజయవంతం కోసం గ్రామాలు,పట్టణాలు, మండల కేంద్రాల్లో గతనెల రోజుల్లో సిపిఎం శ్రేణులు వివిధ స్థాయిల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ప్రజా ప్రణాళిక ఇలా...
సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళిక ప్రకారం విద్యుత్‌ ఛార్జీలను గణనీయంగా తగ్గించాలి. కరెంటు యూనిట్‌ రూపాయికే. పేదలకు 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. స్మార్ట్‌మీటర్ల బిగింపు, ట్రూఅప్‌ ఛార్జీలు రద్దు చేయాలి. రూ.400లకే గ్యాస్‌, రూ.60కే లీటర్‌ పెట్రోలు, డీజిల్‌. ఇసుక ఉచితంగా ఇవ్వాలి. మనిషికి పదికేజీల ఉచిత బియ్యం, పప్పు నూనెల సరఫరా, నిత్యావసర ధరల తగ్గింపు. అందరికీ సంక్షేమం, పెన్షన్లు, రేషన్‌కార్డులు అన్నిరకాల పెన్షన్లు రూ.5000, పేద మహిళలకు ప్రత్యేక సాయం. రెండు సెంట్ల ఇల్లు,రూ.5 లక్షల ఆర్థికసాయం, నివాసిత ప్రాంతాల్లోనే ఇళ్లకు పట్టాలు, కొత్తకాలనీలకు అన్ని సౌకర్యాలు, చెత్తపన్ను, డ్రెయినేజీ ఛార్జీలు రద్దు, ఇంటిపన్ను తగ్గింపు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతిలోనే రాజధాని.
40 వేల టీచర్‌ పోస్టులకు మెగా డిఎస్‌సి, 2.50 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ, నిరుద్యోగభతి నెలకు రూ.5000. ఒపిఎస్‌ పునరుద్ధరణ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్‌. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు రెండెకరాల భూమి, సేకరించిన భూముల్లో పరిశ్రమలు, లేదంటే రైతులకు వాపస్‌. అసలు పట్టాదారుకే అసైన్డ్‌ భూములపై హక్కులు, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద 200 రోజుల పని, రోజు వేతనం రూ.600. పట్టణ ఉపాధి గ్యారంటీ చట్టం, సమానపనికి సమాన వేతనం.
చిన్న పరిశ్రమలు, వ్యాపారులకు రక్షణ, మెగా మాల్స్‌పై ఆంక్షలు, రాష్ట్రంలో ఐటి, ఫార్మా, టెక్స్‌టైల్‌, జూట్‌, పేపర్‌, అగ్రి, సినీరంగం, పరిశ్రమల అభివద్ధి. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు. సమగ్ర సంక్షేమ చట్టం, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌. ప్రభుత్వ ఉద్యోగులుగా స్కీం వర్కర్లు.
అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌, కిడ్నీ పేషెంట్లకు మందులు, పెన్షన్‌, సుజాతారావు కమిటీ సిఫార్సులు అమలు. రైతులకు గిట్టుబాటు ధర. ప్రతి ఎకరాకు సాగునీరు, మోటార్లకు ఉచిత విద్యుత్‌, ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు, రుణం గ్యారంటీ, స్వామినాథన్‌, జయతీఘోష్‌, రాధాకష్ణ కమిషన్‌ సిఫార్సుల అమలు. 2024 నుండే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళల రక్షణ, అభివద్ధికి కమిషన్‌. మద్యపానంపై నియంత్రణ, డ్రగ్స్‌ నిర్మూలన. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, అటవీ సంరక్షణ చట్టసవరణ రద్దు. పోడు భూములకు పట్టాలు, ప్రత్యేక డిఎస్‌సి, ఏజెన్సీలో నాన్‌ షెడ్యూలు గిరిజన గ్రామాలు జిఓ 3 అమలు.
సామాజిక న్యాయం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, కులగణన, వివక్షపై కఠినచర్యలు, సబ్‌ప్లాను అమలు, దళితులకు రక్షణ, జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సుల అమలు, డప్పు, చర్మకారులందరికీ పెన్షన్లు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.లక్ష కోట్లతో ప్యాకేజీ, నిర్ణీత కాలపరిమితిలో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి. నిర్వాసితుల పునరావాసానికి ప్రాధాన్యత. 2013 భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు. పరిశుభ్రమైన వాతావరణం, సముద్రతీర సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ. కాలుష్యరహిత రాష్ట్రాన్ని మార్చాలి. మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు, మత సామరస్యం, సచార్‌, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సుల అమలు. వృత్తులకు రక్షణ, ఆధునిక పరికరాల సరఫరా. బిసిలకు సబ్‌ప్లాన్‌, ప్రత్యేక నిధులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి రుణాలు, సబ్సిడీలు. వికలాంగుల చట్టానికి రూల్స్‌ నోటిఫై. ఇతర పెన్షన్లతో సంబంధం లేకుండా నెలావారీ భృతి రూ.6000.
ప్యాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ, జనరల్‌ బోగీల పెంపు, ఆర్‌టిసి బస్సుల్లో విద్యార్థులు, మహిళలు, వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, స్థానిక సంస్థల పరిధిలోకి సచివాలయాలు. గ్రామీణాభివద్ధికి నిధులు అధికంగా ఇవ్వాలి. ప్రభుత్వ రంగం బలోపేతం, సహకార వ్యవస్థ పటిష్టం. డెయిరీ, చక్కెర మిల్లుల పున:ప్రారంభం చేయాలి. కర్నూలుకు హైకోర్టు, విజయవాడ, విశాఖకు బెంచీలు. సత్వరన్యాయం, యువ న్యాయవాదులకు ప్రోత్సాహం. అవినీతిపై ప్రజా యుద్ధం, పకడ్బందీగా చట్టాల అమలు, బడా కార్పొరేట్లపై పన్ను, బ్యాంకు బకాయిలు వసూళ్లుకు చర్యలు తీసుకోవాలి. పిల్లలు, వద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఉచిత వద్ధాశ్రమాలు, శ్రామిక మహిళల పిల్లలకు ఉచిత డేకేర్‌ సెంటర్లు. జానపద, వద్ధ కళాకారులకు భతి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, రాజ్యాంగానికి లోబడి సుపరిపాలన, ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల బాండ్లు రద్దు, కార్పొరేట్‌ నిధులకు చెక్‌, పౌరుల వ్యక్తిగత గోప్యానికి భద్రతకల్పించాలి. ప్రజాస్వామ్య, లౌకిక సంస్కృతి పరిరక్షణ, భారతీయ ఉత్తమ సంప్రదాయాలు, స్వాతంత్య్రోద్యమ వారసత్వం కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలి.