ప్రజాశక్తి-బాపట్ల: జిల్లా కేంద్రమైన బాపట్లలో పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం విస్తరణ పనులకు ఈ నెల 18 ఆదివారం శంకుస్థాపన చేస్తున్నట్లు సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య శనివారం విలేకరులకు తెలిపారు. గంగయ్య మాట్లాడుతూ గత ఆరేళ్ల క్రితం అనేకమంది ఉద్యమ శ్రేయోభిలాషుల సహకారంతో బాపట్ల ప్రాంతంలో ఉద్యమ అవసరాల కోసం ప్రజాసంఘాల భవనం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడ్డాక జిల్లా స్థాయిలో అవసరాలరీత్యా ఉన్న భవనంపై జిల్లా ప్రజాసంఘాల కార్యాలయ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యమ శ్రేయోభిలాషులం దరూ సహాయ సహకారాలు అందించాల న్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఈ కార్యాలయం కేంద్రంగా కార్మికులు, కర్షకులు, సామాజిక శక్తుల సమస్యలపై, సమస్యల పోరాటాలు నిర్వహించడానికి కేంద్రంగా ఉంటుందని అన్నారు. కార్యాలయ విస్తరణకు జరిగే శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే ధనలక్ష్మి ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. వామపక్షవాదులు, ప్రజాతంత్ర సామాజిక శక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్, వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, కెవిపిఎస్ నాయకులు కే నాగేశ్వరరావు, మహిళా సంఘం నాయకురాలు సుభాషిణి పాల్గొన్నారు.










