Sep 10,2023 23:02

లకీëపురం సెంటర్లో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టిడిపి శ్రేణులు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : చంద్రబాబు అక్రమ అరెస్టునకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించేందుకు టిడిపి నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో చంద్రబాబుకు విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే జిల్లాలోని అన్నిమండల కేంద్రాల్లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు అధికారులు ఎక్కడికక్కడ ప్రకటించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి బందోబస్తు నిర్వహించారు. కూడలి ప్రదేశాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రిమాండ్‌ విధించగానే సత్తెనపల్లి,గుంటూరులో టిడిపి కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలో టిడిపి కార్యకర్తలు సిఎంజగన్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు. వెంటనే పట్టాభిపురం సిఐ రాజశేఖర్‌రెడ్డి వచ్చి టిడిపి నాయకుడు సుఖవాసి శ్రీనివాసరావుతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో సెక్షన్‌ 30 అమలులో ఉందని సిఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై కేసు నమోదు చేస్తున్నామని సిఐ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్‌పి ఆరీఫ్‌ హఫీజ్‌ పర్యవేక్షించారు. పల్నాడు జిల్లాలో పరిస్థితిని ఎస్‌పి రవిశంకరరెడ్డి పరిశీలించారు. సోమవారం టిడిపి నాయకులు బంద్‌లో పాల్గొనకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రినుంచి వారి ఇళ్ల ముందు పోలీసులనుకాపాలాగా ఉంచుతున్నారు. టిడిపి నాయకులందరిని గృహనిర్బంధంలో ఉంచాలని నిర్ణయించారు. బంద్‌కు ఎవ్వరూ సహకరించాదని ఇప్పటికే అధికారులు వ్యాపారులకు, ఇతర సంస్థలకు తెలియజేస్తున్నారు. ప్రజా కార్యకలాపాలు యథాతథంగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. బంద్‌ నేపధ్యంలో విద్యా సంస్థల వారు ముందుగానే శెలవు ప్రకటించాయి. మరో వైపు చంద్రబాబు నాయుడ్ని తాడేపల్లిలోని సిఐడి సిట్‌ కార్యాలయం నుంచి ఆదివారం తెల్లవారుజామున విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం తిరిగి తాడేపల్లి తీసుకువచ్చారు. ఉదయం 5.30 గంటల సమయంలో తిరిగి తాడేపల్లి నుఒంచి విజయవాడ కోర్టుకు తీసుకువెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా...రిమాండ్‌ విధిస్తారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ప్రజలంతా టివిలకు అతుక్కుపోయి ఉత్కంఠగా ఎదురుచూశారు. తీవ్ర ఉత్కంఠ నడుమ రాత్రి 7 గంటల సమయంలో చంద్రబాబుకు రిమాండ్‌ విధించారని సమాచారం రావడంతో టిడిపి కార్యకర్తలు, నాయకులు తీవ్రనిరాశకు గురయ్యారు. కొంత మంది రోడ్లపైకి వచ్చి నిరసనకు ప్రయత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టారు. బంద్‌ నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలోని అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు పహారా పెంచారు.