ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు గురువారం ఒక ప్రకటనలో కోరారు. సభకు సిపిఎం పొలిట్‌బ్యూర్ సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు పాల్గొంటారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయని, సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని, రాజ్యాంగంలోని లౌకిక, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతిస్తోందని తెలిపారు. మణిపూర్‌లో 4నెలల నుండి మైనార్టీలు, గిరిజనలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించి రాష్ట్రాన్ని సందర్శించకపోవడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం బాటలోనే పయనిస్తోందని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం దీనిలో భాగమని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, విశాఖ రైల్వే జోన్‌కు పోలవరం ప్రాజెక్టుకు, కడప ఉక్కు కర్మాగారానికి రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిన కేంద్రంపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు పోరాడకుండా బిజెపి విధానాలను సమర్ధించడం సరికాదని విమర్శించారు. ఈ నేపథ్యంలో జరిగే సభను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.










