
నేడు బహిరంగ సభను జయప్రదం చేయండి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి - నంద్యాల
సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సుయాత్ర నేడు నంద్యాలకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుందని, ఈ సందర్భంగా రాజ్ థియేటర్ దగ్గర జివి షాపింగ్ మాల్ ఎదురుగా జరిగే బహిరంగ సభలో కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ కోరారు. సోమవారం నంద్యాలలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ఇస్తామని, కర్నూల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని చెప్పారు. వైసిపి ప్రభుత్వం వీటి గురించి ఏమాత్రం పోరాటం చేయకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోకుండా బిజెపి విధానాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు హామీల అమలు కోసం పోరాటం గానీ, బిజెపిపై నోరు మెదపడం లేదన్నారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎంను బలపరచాలని, ప్రజాతంత్ర వామపక్షవాదులను ప్రజలు ఆదరించాలని కోరుతూ సిపిఎం మేనిఫెస్టోని ప్రజల్లోకి విస్తతంగా తీసుకువెళ్లడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 15న చలో విజయవాడ లక్షలాదిమంది ప్రజలతో బహిరంగ సభ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ప్రజల్లోకి తీసుకుపోనుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.నాగరాజు, పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, సీనియర్ నాయకులు తోట మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె.మహమ్మద్ గౌస్, లక్ష్మణ్, పి వెంకట్ లింగం తదితరులు పాల్గొన్నారు.