ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఆటో కార్మికుల సమస్యలపై శుక్రవారం నిర్వహించే చలో విజయవాడను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) కార్యదర్శి ఎం.హరిపోతురాజు పిలుపు నిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని ఎన్‌ఆర్‌టి సెంటర్, కళామందిర్ సెంటర్, వేలూరు ఆటో పాయింట్, పసుమర్రు, నాదెండ్ల, యద్దనపూడి తదితర ఆటో పాయింట్లు వద్ద, తుర్లపాడు, మానుకొండ వారిపాలెం, ఉప్పలపాడు, పెదనందిపాడు ఆటోలు ఆగే ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీతో ప్రచారం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన మోటార్ వాహన చట్ట సవరణ చేయగా దాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుక వైసిపి ప్రభుత్వం జీవో 21ను జారీ చేసిందన్నారు. రవాణా రంగంపై తీవ్రమైన భారాలు మోపుతున్నారని విమ ర్శించారు. గతంలో ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే వాటిని ప్రమాదంగా ఎఫ్‌ఐఆర్‌లో రాసేవారని, కొత్త చట్టంలో హత్యలుగా నమోదు చేయాలని ఉందని తెలిపారు. రవాణా రంగం నుండి ఏడాదికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందు తున్న ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. కేరళ, తమిళనాడులో మాత్రమే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పి.రాజు, కె.రాజు, విల్సన్, పుష్పరాజు పాల్గొన్నారు.










