Dec 11,2022 23:42

ప్రదర్శన చేపడుతున్న యుటిఎఫ్‌ నేతలు, ఉపాధ్యాయులు (ఫైల్‌ పొటొ)

ప్రజాశక్తి-పాడేరు: గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న సోమవారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఐటీడీఏల ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు జిల్లాలోని పాడేరు, చింతూరు, రంపచోడవరం, ఐటీడీఏల ఎదుట యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. దీర్ఘకాలంగా గిరిజన విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గత ఏడాదికాలంగా యుటిఎఫ్‌ ప్రత్యేక కార్యాచరణతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత అక్టోబర్‌ 15 నుంచి 22 వరకు అన్ని ఐటిడిఎల పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలను సందర్శించి సమస్యలు గుర్తించేందుకు యుటిఎఫ్‌ బృందాలు జీపుజాతా ద్వారా పర్యటించాయి. గిరిజన విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే క్రమంలో నవంబర్‌ 20న అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరులో యుటిఎఫ్‌ రాష్ట్ర విద్యా సదస్సును కూడా నిర్వహించింది.
గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారంలో అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం తీవ్ర అలసత్వం వహించడంపై యుటిఎఫ్‌ రాష్ట్ర విద్యా సదస్సులో చేసిన తీర్మానం మేరకు ఈ నెల 12న ఐటీడీఏల ముట్టడి చేపట్టనుంది. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని వసతి గృహాల్లో వార్డెన్లు, కుక్‌లు, కమాటీలు, నియామకం చేపట్టాలని విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలని, కాస్మోటిక్‌ చార్జీలు పునరుద్ధరించాలని భాషా పండిట్ల అప్‌ గ్రేడేషన్‌ నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులకు డీఈవో, ఎంఈఓ, ప్రమోషన్లు కల్పించాలని యుటిఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. అలాగే భాషా పండిట్ల అప్‌ గ్రేడేషన్‌, భాషా వాలంటీర్లను కొనసాగింపు, రిక్రూట్మెంట్లు, ఆశ్రమ పాఠశాలలను ప్లస్‌ టుగా స్థాయి పెంచాలని తదితర డిమాండ్లతో గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ ప్రభుత్వంపై పోరు సాగిస్తోంది.