Aug 18,2023 22:09

బూర్జ : పెద్దలంకాం పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఎన్నికల సిబ్బంది, పోలీసులు

* నాలుగు సర్పంచ్‌, పది వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నిక
* చివరి క్షణంలో రెండు చోట్ల వాయిదా
* ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,459 మంది ఓటర్లు
* సాయంత్రం ఫలితాలు వెల్లడి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్‌, వార్డు మెంబర్ల స్థానాలకు శనివారం పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 13 మండలాల పరిధిలో నాలుగు సర్పంచ్‌, 11 మంది వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో చివరి క్షణంలో పొందూరు మండలం గోకర్ణపల్లి పంచాయతీలోని రెండో వార్డు, సంతబొమ్మాళి మండలం సంతబొమ్మాళి పంచాయతీలోని 12వ వార్డు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై అభ్యర్థి జి.నరసింహారావు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నిక వాయిదా పడింది. బ్యాలెట్‌ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. బ్యాలెట్‌ విధానంలోనే పోలింగ్‌ జరుగనుంది.
జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల ఆరో తేదీన నోటిఫికేషన్‌ వెలువరించింది. ఆరు పంచాయతీలు, 96 వార్డు మెంబర్లకు ఎన్నిక కోసం ప్రకటన ఇచ్చారు. వాటిలో కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీకి ఒక్కరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. ఆ స్థానాన్ని ఎస్‌టికి రిజర్వేషన్‌ చేయడం, పంచాయతీలో ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు రాలేదు. ఆమదాలవలస మండలం అక్కివరం పంచాయతీ ఏకగ్రీవమైంది. దీంతో నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వార్డు మెంబర్లకు సంబంధించి 96 స్థానాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 18 చోట్ల ఒక్కరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. మరో 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పొందూరు మండలం గోకర్ణపల్లి, సంతబొమ్మాళి పంచాయతీలోని 12వ వార్డు ఎన్నిక వాయిదా పడడంతో మిగిలిన పది స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ స్థానాలకు 29 మంది, వార్డు మెంబర్ల స్థానాలకు 29 మంది పోటీలో ఉన్నారు.
5,459 మంది ఓటర్లు
ఎన్నికల్లో మొత్తం 5,459 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,640 పురుషులు, 2,519 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం మొత్తం 20 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు అవసరమైన 1,590 బ్యాలెట్‌ బాక్సులను ఆయా కేంద్రాలకు చేర్చారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం 113 మంది మొదటి ఆర్‌ఒలు, 23 మంది రెండో ఆర్‌ఒలను నియమించారు. 25 మంది పోలింగ్‌ అధికారులను నియమించారు. 48 మందిని పోలింగ్‌ సహాయక సిబ్బందిని నియమించారు. రూట్‌ అధికారులు, జోనల్‌ అధికారులుగా 16 మంది చొప్పున నియమించారు. ముగ్గురిని సూక్ష్మ పరిశీలకులను నియమించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వెబ్‌కాస్టింగ్‌ కోసం 16 మందిని ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లెక్కింపు
పోలింగ్‌ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌ కోసం 16 మంది సూపర్‌వైజర్లను నియమించారు. సహాయక సిబ్బందిగా 32 మందిని నియమించారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించి, గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు.
పోలింగ్‌ జరిగే ప్రాంతాలు ఇవే
మండలం సర్పంచ్‌ స్థానం
సరుబుజ్జిలి బొప్పడాం
నందిగాం అన్నవరం
సారవకోట బద్రి
బూర్జ పెద్ద లంకాం
వార్డు మెంబర్ల స్థానాలు
మండలం పంచాయతీ వార్డు నంబరు
టెక్కలి నర్సింగపల్లి 7
సరుబుజ్జిలి తెలికిపెంట 10
పోలాకి కొత్తరేవు 1
ఘాతలవలస 6
ఆమదాలవలస కొరపాం 4
జలుమూరు జోణంకి 2
ఎచ్చెర్ల డి.మత్స్యలేశం 6
నరసన్నపేట కోమర్తి 3
మాకివలస 2
వజ్రపుకొత్తూరు యుజి పురం 4
ఎన్నిక వాయిదాకు కారణాలు ఇవే...
ప్రజాశక్తి - పొందూరు, సంతబొమ్మాళి
పొందూరు మండలం గోకర్ణపల్లిలో శనివారం నిర్వహించాల్సిన పంచాయతీ రెండో వార్డు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అధికార పార్టీ ఒత్తిడి మేరకు పంచాయతీ అధికారులు ఓటరు జాబితాను ట్యాంపరింగ్‌ చేశారని అభ్యర్థి జి.నరసింహారావు, మాజీ ఎంపిటిసి సీపాన శ్రీరంగనాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
సంతబొమ్మాళి పంచాయితీ 12వ వార్డు ఎన్నిక ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. వార్డు మెంబర్‌ పదవుల కోసం పోటీ చేస్తున్న చమళ్ళ అనుసూయమ్మ, రెయ్యి బాలకృష్ణకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంతో, అధికారులు స్పందించి ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికను ఈనెల 23వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.