ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్న కొండ చుట్టూ ఆదివారం చేపట్టే సింహగిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తొలి పావంచ వద్ద ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటుచేసి భక్తుల కొబ్బరికాయలు కొట్టేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఉదయం నుంచి గిరిప్రదక్షిణకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం స్వామివారి రథాన్ని అనువంశిక ధర్మకర్త ప్రారంభించడంతో అధికారికంగా గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ జరిగే ప్రదేశాల్లో ప్రతి అర కిలోమీటర్‌కు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటుచేసి విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటుచేశారు. కొండ చుట్టూ సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు, వాటికి నిరంతరం నీరు అందేలా ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నారు. జోడిగుళ్లపాలెం, అప్పుగర్ పరిసర సముద్ర ప్రాంతాల్లో గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. 32 కిలోమీటర్ల చుట్టూ రోడ్లపై విద్యుత్ దీపాలంకరణ చేశారు. సుమారు 6 నుంచి 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తూ ఏర్పాట్లుచేశారు. ఎక్కడికక్కడ అంబులెన్స్‌లు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచుతున్నారు. అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రదేశాలలో పడే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా శానిటేషన్ సిబ్బందిని సిద్ధంచేశారు. గిరిప్రదక్షిణ చేసి వచ్చే భక్తులు సింహగిరి చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. వాహనాల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా హనుమంతువాక, శొంఠ్యాం నుంచి వచ్చే వాహనాలను ఆడవివరం జంక్షన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. గోపాలపట్నం, వేపగుంట మీద వచ్చే వాహనాలను గోశాల వద్ద నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టారు.










