Mar 13,2023 00:01

ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు, పాడేరు టౌన్‌:ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం ఆసన్నమయింది. ఈనెల 13న సోమవారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయమే పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులతో సహా తమకు కేటాయించిన వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు ఉమ్మడి విశాఖ జిల్లా ఫరిధిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాలలో ఈ ఎన్నికకు సంబంధించి 15 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసారు. 11 మండలాలలో 11 పోలింగ్‌ కేంద్రాలతో పాటు హుకుంపేట, జి.కే వీధి, పాడేరు, అరకులలో అదనంగా ఒక్కో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసారు. జిల్లాలో పురుష ఓటర్లు 7861 మంది, మహిళా ఓటర్లు 3661 మంది నమోదు కాగా ముగ్గురు ఇతర ఓటర్లతో కలిపి 11525 మంది పట్టభద్రుల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 11 మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నిమిత్తం ఓటు హక్కును వినియోగించుకునే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం ఒకరోజు సెలవు మంజూరు చేసింది. అల్లూరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాటశాలలో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్సన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13వ తేదీ సాయంత్రం పోలింగ్‌ అనంతర మెటీరియల్‌ తీసుకోవడానికి కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. పోలింగ్‌ అనంతరం జిల్లా కేంద్రంలోని తలారిసింగి స్ట్రాంగ్‌ రూమ్‌కు బ్యాలెట్‌ బాక్స్‌లు తరలించి సోమవారం రాత్రి భద్రపరిచి ఓట్ల లెక్కింపు కేంద్రమైన విశాఖలోని స్వర్ణ భారతి ఇండోర్‌ స్టేడియంకు షీల్డ్‌ బ్యాలెట్‌ తరలించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు.
పటిష్ట చర్యలు
జిల్లాలోని పాడేరు డివిజన్‌ 11 మండలాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఆదివారం ఎన్నికల సిబ్బంది తరలి వెళ్లారు. జిల్లా కేంద్రం పాడేరులో తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల (బాలురు) ఆవరణలో పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసి పోలింగ్‌ కేంద్రాలకు ఆర్‌టిసి బస్సుల్లో తరలించారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 15 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 7 బస్సులు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కలెక్టరేట్‌ నుంచి ఎన్నికల సామాగ్రిని ఉదయం 6 గంటలకే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ నుండి జోన్‌/రూట్‌ల వారీగా కేటాయించిన ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు ఏర్పాటు చేసిన ఆర్‌టిసి బస్సుల్లో పోలీసు బందోబస్తుతో తరలి వెళ్లారు.
ఎన్నికల సామగ్రిని కలెక్టర్‌ పరిశీలన
జిల్లా కలెక్టర్‌ సమిత్‌ కుమార్‌ ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుండి నేరుగా పోలింగ్‌ కేంద్రానికి తప్ప మధ్యలో ఎక్కడా ఆగరాదని ఆదేశించారు. మధ్యలో ఆగితే తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని హెచ్చరించారు.
సిబ్బందికి జెసి సూచనలు
అనంతరం జెసి, ఎన్నికల ప్రత్యేక అధికారి జె.శివశ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల సామగ్రి తీసుకుని తిరిగి అప్పజెప్పేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన వర్క్‌ పై పూర్తి అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. ఎన్నికలకు సంబంధించి సామాగ్రి వాడే విధానంతో పాటు కవర్లను, పేపర్లను ఏ విధంగా వాడాలి, మడత పెట్టాలన్నది చేసి చూపించారు. పోలింగ్‌ నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించారు. ఏజెన్సీ 11 మండలాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, డిఆర్‌ఒ పి.అంబేద్కర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శర్మ, రమణ, పరిపాలనాధికారి చిన్నికృష్ణ, టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, ఎటిడబ్ల్యూఒ ఎల్‌.రజిని, జోన్‌/రూట్‌ అధికారులు పాల్గొన్నారు.