Feb 16,2023 00:17

నది నుంచి గాసీరామ్‌ మృతదేహాన్ని తీసుకొస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -సీలేరు
ఆంధ్ర ఒడిశా సరిహద్దు సీలేరు నదిలో బుధవారం పడవ మునిగి ఒకరు మృతి చెందారు ఒడిశా పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.... ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధి స్పిల్‌ వే గ్రామానికి చెందిన గాసీరామ్‌ ఖిల్‌ (60) నాటుపడవపై నదిలో చేపల వేటకు వెళ్లారు. పడవ రంద్రాల ద్వారా నీరు పడవలో చేరుకోవడంతో పడవ ఒక్కసారిగా ఒకపక్క ఒరిగిపోయి బోల్తా పడింది. గాసీరామ్‌ ఈత రాకపోవడంతో నదిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు నదిలో పడవ మునిగిపోయినట్లు గుర్తించారు. దీంతో వారి బంధువులకు, పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పిగించారు.