ప్రజాశక్తి - తాడేపల్లి : ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో నదిలో ఈత ద్వారా సేదదీరడానికని వచ్చిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఎన్‌టిఆర్ జిల్లా యనమలకుదురు, పటమటకు చెందిన ఏడుగురు యువకులు కలిసి ఆదివారం తాడేపల్లి సమీపంలోని పాతూరు వద్ద కృష్ణానదికి వచ్చారు. అందరూ కలిసి నదిలో దిగి ఈత వేస్తుండగా పటమట ప్రాంతానికి చెందిన బాలాజి, సాయితేజ ఉన్నట్టుండి గుంతల్లో పడి మునిగి గల్లంతయ్యారు. ఇది గమనించిన తోటివారు పెద్దగా అరుచుకుంటూ వడ్డుకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికి తీయించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.










