Jul 13,2021 06:17

     రాష్ట్ర విభజన చట్టంసెక్షన్‌ 85 (1) ప్రకారం రెండు రాష్ట్రాలు అవతరించిన 60 రోజుల లోపల గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వుంది. గోదావరి, కృష్ణా నదులపై గల ప్రాజెక్టుల ఆపరేషన్‌కు చెందిన అడ్మినిస్ట్రేషన్‌ రెగ్యులేషన్‌ మైన్‌టైన్‌ కోసం బోర్డులను ఏర్పాటు చేసి నోటిఫై చేయవలసి వుంది. ఇంత వరకు ఈ నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం నోటిఫై చేయలేదు.
     రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ఈ దశకు చేరడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కట్టుకున్న పుణ్యం ఎక్కువగా వుంది. రాష్ట్ర విభజన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి వుంటే ఈ ఉద్రిక్తతలు ఇంత మోతాదులో వుండేవి కావు. గోదావరి కృష్ణా నదీ జలాల పంపిణీ ప్రాజెక్టుల నిర్వహణ తదితర వివాదాంశాలపై రాష్ట్ర విభజన చట్టంలో ఎట్టి అరమరికలు లేకుండా స్పష్టత వుంది. కాని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన నాటి నుండి ఉద్దేశ పూర్వకంగానే రెండు రాష్ట్రాల మధ్య ఒక్క సాగునీటి ప్రాజెక్టుల అంశంలోనే కాకుండా ఇతర పలు అంశాలను నానబెడుతూ చిచ్చు రగుల్చుతోంది.
     రాష్ట్ర విభజన చట్టం సెక్షన్లు 84, 85, 86 తో పాటు 11వ షెడ్యూల్‌ లో గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు, వాటి విధుల గురించి స్పష్టత ఇచ్చారు. సెక్షన్‌ 85 (1) ప్రకారం రెండు రాష్ట్రాలు అవతరించిన 60 రోజుల లోపల గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వుంది. గోదావరి, కృష్ణా నదులపై గల ప్రాజెక్టుల ఆపరేషన్‌కు చెందిన అడ్మినిస్ట్రేషన్‌ రెగ్యులేషన్‌ మైన్‌టైన్‌ కోసం బోర్డులను ఏర్పాటు చేసి నోటిఫై చేయవలసి వుంది. అంటే చట్టబద్దత కల్పించ వలసి వుంది. అంతేగాని ఏ రాష్ట్రమైనా అభ్యంతరం చెబితే నోటిఫికేషన్‌ నిలుపుదల చేయాలని చట్టం లోని ఏ సెక్షన్‌ లోనూ లేదు. కాని తెలంగాణ అడ్డు చెబుతూ వుందని ఇంత వరకు ఈ నదీ యాజమాన్య బోర్డులను కేంద్రం నోటిఫై చేయలేదు. ఏడేళ్లు గడచి పోతున్నా కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాలకు చట్ట పరంగా తెర దించేందుకు రెండు యాజమాన్య బోర్డులను ఎందుకు నోటిఫై చేయలేదు? బోర్డుల పరిధి నిర్ణయించనందున సెక్షన్‌ 85(3)లో పేర్కొన్న ముఖ్యమైన అంశాన్ని అయాచితంగా త్రిశంకుస్వర్గం లోనికి నెట్టేశారు.
     సెక్షన్‌ 85 (2) ప్రకారం గోదావరి యాజమాన్య బోర్డును తెలంగాణ లోనూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఏర్పాటు చేయవలసి వుంది. ఇప్పటికీ రెండు బోర్డులు హైదరాబాద్‌ లోనే వున్నాయి. ఇటీవల కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుకు అంగీకారం కుదిరినా కృష్ణా నదికి ఎటువంటి సంబంధం లేని వైజాగ్‌ లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. కృష్ణా జలాల్లో న్యాయ పరమైన వాటా లేదని ఆందోళన చేస్తున్న రాయలసీమ వాసులకు వైజాగ్‌ లో నెలకొల్పేందుకు తీసుకున్న నిర్ణయం పుండుపై కారం రాసినట్లయింది.
      మరో ముఖ్యమైన అంశమేమంటే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 85 (3) మేరకు గోదావరి కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు స్వయం ప్రతిపత్తి సంస్థలు (అటానమస్‌ బాడీలు) గా కేంద్ర ప్రభుత్వ అధీనంలో వుండి కేంద్రం జారీ చేసే ఆదేశాలు అమలు చేయ వలసి ఉంది. సెక్షన్‌ 85 (3)లో బోర్డులు అటానమస్‌ బాడీలుగా పేర్కొన్నారే గాని ఎక్కడ కూడా కేంద్రం నోటిఫై చేసిన తర్వాత స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా వుంటాయని పేర్కొనలేదు.
     మరో ఆశ్చర్యకరమైన అంశమేమంటే సెక్షన్‌ 85 (7) మేరకు కేంద్ర బలగాలను యాజమాన్య బోర్డులకు రక్షణగా ప్రాజెక్టుల వద్ద కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ ఎలాగూ మొండిగా వెళుతోంది. తుదకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వివాదం ముదిరిన తరువాత ఇటీవల ఒక లేఖలో పేర్కొన్నది. మొన్న వైసిపి నేత విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వైసిపి ప్రభుత్వం ఇంతవరకు సెక్షన్‌ 85 (7)ను విస్మరించాయి. ప్రాజెక్టుల వద్ద తమ తమ పోలీసు బలగాలను మోహరించడంలో చూపుతున్న చొరవ చట్ట పరంగా వున్న అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ చూపలేదు. గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు రోజువారీ రెండు నదులపై గల రిజర్వాయర్ల అజమాయిషీ సందర్భంగా సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ రక్షణ కలిగి వుండాలని సెక్షన్‌ 85(7) చెబుతోంది. సెక్షన్‌ 85(1) మేరకు నోటిఫై తో సంబంధం లేకుండా ఈ సెక్షన్‌ అమలు చేయవచ్చు. ఏడేళ్లు గడచి పోయినా కేంద్రం ఈ సెక్షన్‌ ను అమలు చేయలేదు. ఈ ఏడేళ్ల కాలంలో రెండు దఫాలు ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రాజెక్టుల వద్ద మోహరించినా కేంద్రం చోద్యం చూస్తున్నదే తప్ప చట్టపరంగా వున్న వెసులుబాటును ఉపయోగించి కేంద బలగాలను ఎందుకు మోహరించడం లేదు?
       అంతేకాదు. సెక్షన్‌ 85 సబ్‌ సెక్షన్‌ (8)(2) కూడా నదీ జలాల పంపిణీ గురించి స్పష్టత ఇచ్చింది. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గాని కేంద్ర మంత్రి షెకావత్‌ గాని ఈ అంశాల్ని పరిగణన లోనికి తీసుకోవడం లేదు. ఈ సెక్షన్‌ ఏం చెబుతుందంటే 1956 అంతర్‌ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్‌ 3 కింద నియమింప బడిన ట్రిబ్యునల్‌ తీర్పు అమలులో వుంటే దాని మేరకే ఆయా రాష్ట్రాలకు నదీ జలాలను పంపిణీ చేయవలసి వుంది. ఇదే అంశాన్ని 11వ షెడ్యూల్‌లో పొందు పరిచారు. అంటే కృష్ణా నదీ జలాలకు చెందిన బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు గోదావరి కి చెందిన గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ఇప్పుడు అమలులో వున్నాయి. కాగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 89 కూడా ఈ అంశంలో స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర విభజన నాటికి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగకుండా నీరు మిగిలి వుంటే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని నీటి ఎద్దడి రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య ప్రోటోకాల్‌ నిర్ణయించాలని వుంది. ఇక్కడ గమనంలోనికి తీసుకోవలసిన అంశమేమంటే బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చిన్న నీటి వనరులతో సహా పంపకం చేసింది. ఆ మేరకే ఆంధ్రప్రదేశ్‌కు 512 టియంసి లు తెలంగాణకు 299.99 లుగా వున్నాయి.
రాష్ట్ర విభజన చట్టంలో నదీ జలాల పంపిణీ గురించి ఇంత స్పష్టత వుంది. విద్యుదుత్పత్తి చేయడానికి సంబంధించి 11వ షెడ్యూల్‌లో స్పష్టత వుంది. నీటి కొరత ఏర్పడిన రోజుల్లో విద్యుత్‌ ఉత్పత్తి కన్నా సాగు నీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటికి ఇబ్బందులు వుంటే సాగునీటికి రెండవ ప్రాధాన్యత ఇవ్వాలని వివరంగా పేర్కొన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహణలో నదీ యాజమాన్య బోర్డులతో నిర్వర్తించ వలసి వుండగా గాలికి వదలి పెట్టింది.
       గత అక్టోబర్‌ లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సుప్రీంకోర్టులో వున్న కేసు వెనక్కి తీసుకొంటే కృష్ణా నదీ జలాల తిరిగి పంపిణీకి కేంద్ర మంత్రి షెకావత్‌ మాట ఇచ్చారని, ఆ మేరకు కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. న్యాయ పరంగా ఇది ఎలా చెల్లుబాటు అవుతుంది? ప్రస్తుతం బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమలులో వుంది. పైగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు 2013లో వెలువడగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసి నోటిఫై కాకుండా స్టే తెచ్చింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రస్తుతం త్రిశంకుస్వర్గంలో వుంది. తెలంగాణ తన కేసు వెనక్కి తీసుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వేసిన కేసు, తదుపరి ఆంధ్రప్రదేశ్‌ వేసిన కేసు సుప్రీంకోర్టులోనే వున్నాయి. ఇవి తేలే వరకు వేచి వుండకుండా తెలంగాణ కేసు వెనక్కి తీసుకున్నంత మాత్రాన మూడవ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఎలా నియమిస్తుంది?
     ఆంధ్ర ప్రదేశ్‌ ఇప్పటి వరకు నదీ జలాల వివాదాల అంశంలో కోర్టుల మెట్లెక్కకుండా సామరస్యం పాటిస్తూ వుంటే...మూడవ ట్రిబ్యునల్‌ నియమించే అవకాశం తోసిపుచ్చలేము. ఈ అంశం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. దానివలన ప్రయోజనం లేదు. ఇక్కడ గమనించవలసిన అంశమేమంటే గత అక్టోబర్‌ లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిపాదన చేసినప్పుడు కేంద్ర మంత్రి కేసు వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్‌ నివేదించుతామని చెప్పిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏమన్నారు? అప్పుడే డిసెంట్‌ నోట్‌ పెట్టారా? రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు చెందిన మినిట్స్‌ బహిర్గతం చేయవలసి వుంది.

వ్యాసకర్త విశ్రాంత పాత్రికేయులు, సెల్‌ : 9848394013
వి. శంకరయ్య

వి. శంకరయ్య