అయోధ్య భూ వివాదంలో రాముడ్ని ప్రతివాదిగా చేర్చి... ఇది రాముడి భూమి, రాముడికే చెందాలన్నారు. కోర్టు కూడా ఆ విధంగానే తీర్పునిచ్చింది. ఆ మధ్య ఒక పార్కును ఆక్రమించి దేవాలయం నిర్మించారని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని అంగీకరిస్తూ... దేవుడు లేదా దేవాలయం చట్టానికి అతీతం కాదని, చట్టానికి లోబడి వుండాలని కోర్టు తెలిపింది. అంతేకాదు.. ఆ కేసులో దేవుడిని కూడా ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. దేవుడి భూములంటూ ఈ భూమ్మీద లేనివాడికి కూడా ఆస్తి హక్కును ఇచ్చారు. మరి భూమి మీదే వున్న నదిని ఒక అస్తిత్వంగా ఎందుకు గుర్తించరు? నదులు కాలుష్యమై పోతుంటే... ఆ నదులను ఉపయోగించుకొనేవారికి ప్రశ్నించే హక్కు ఎందుకు వుండదు? ఒక వ్యక్తికి సమానమైన హక్కులున్నట్లే... చండీగఢ్ లోని సుఖనా సరస్సును ఒక వ్యక్తిగా ప్రకటిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సజీవమైన వ్యక్తికి కొన్ని హక్కులున్నట్లే... నదులకూ హక్కులుంటాయని తెలిపింది.
ఈ వ్యవస్థ నదిని కూడా ఒక వ్యక్తిగా గుర్తిస్తే... ఆ నదిని సంరక్షించుకునే బాధ్యత అందరిదీన్నూ. అలాగే అడవిని ఒక అస్తిత్వంగా గుర్తిస్తే... ఆ అడవిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రకృతిలోని అంతర్భాగాలైన నదులు, అడవులు, భూములు వాడుకుంటున్న మనం వాటి తరఫున పోరాడితే తప్ప న్యాయం జరగదు. కోర్టుల్లో గుర్తించడమే కాదు....ఈ భూమిపైనున్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆహారం లేకుండా కొద్దిరోజులైనా బతకగలుగుతాం. నీరు లేకుండా కొద్ది గంటలు కూడా బతకలేం. నదులు కాలుష్యమైపోతే బతుకు మరింత దుర్భరం. మనిషికి అంత అత్యవసరమైన నీటిని అందించే నదులకు అస్తిత్వమే లేదంటూ, వాటిని కలుషితం చేసి, వాటి మీద వాటాల కోసం రాష్ట్రాలకు రాష్ట్రాలే తగవులాడుకుంటున్నాయి. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం... దేశంలోని 45 నదులు తీవ్ర కాలుష్యం బారిన పడ్డాయి. 300కు పైగా నదులు కలుషితం అవుతున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో మూడింట ఒకవంతు చిత్తడి నేలలు మాయమైపోయాయి. పవిత్రమైన నదులని చెప్పుకునే గంగా, యమున మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైపోయాయి. ఆ నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితి. ప్రతి నదికీ ఒక పేరు వుంది. ఒక చరిత్ర వుంది. ఒక సమగ్రత వుంది. దాని పరీవాహక ప్రాంతం మీద ఆ నదికి హక్కు వుంది. కానీ, దాన్ని ఆక్రమించి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు.
నది మానవ మనుగడకు, జీవి చైతన్యానికి ప్రతీక. మానవ సంస్కృతి విలసిల్లింది నదీ తీరాల్లోనే. నదిలేని మానవ మనుగడను ఊహించలేం. 'నీ చేతి చలువలకె నేల పులకింపంగ/ తట భూజముల నెక్కి తద్భవానందాన/ ఖగపాలికల రుతులు కలిసి స్వస్తులు బల్క/ పొగడపూవులు దాల్చి, పొంగిపొంగి గమించి/ ఇసుక దిబ్బల దూరి బుసగొట్టి బుసగొట్టి/ కంకణమ్ముల గలగలల ముంజేతులటు/ గండశిలలకు తాకి గమకమ్ములంబల్కి/ ప్రవహింతువా' అంటాడో కవి. చిరుగాలి అలలతో కలగలిసి, అమృతం వంటి నీటి బిందువులతో ఒడ్డులను ఒరుసుకుంటూ, కొండలను కౌగిలించుకుంటూ... సెలయేళ్లతో కలిసి, విరులు, తరులను దాటుకుంటూ గలగల పారే నదీమతల్లి... ఈ ప్రకృతిలో ఓ అద్భుతం. తన దగ్గరకు వచ్చినవాళ్లకెవరికీ నీళ్లను నిరాకరించని స్ఫూర్తి నదీమ తల్లిది. నది ఒడ్డున కూర్చుంటే ఆహ్లాదం. కాస్తంత సేద తీరడం, ఊరట చెందడం నదిని చూస్తుంటే... ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ అద్భుతానికిప్పుడు కాలదోషం పట్టింది. కాలుష్యం కాటువేస్తోంది. వనదేవతలని పూజించే అడవులకు ఇప్పుడు బిజెపి గ్రహణం పట్టింది. అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేస్తోంది. గంగను శుద్ధి చేయడానికి ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. నిత్యహారతులిచ్చే ఆచారం కొనసాగుతోంది. ఈ నమ్మకాలను తన రాజకీయానికి వాడుకుంటూనే రెండోపక్క అవే నదులను కార్పొరేట్ల కాలుష్య కాటుకు బలిచేయడానికి పూనుకుంటోంది. ఈ కపట రాజకీయానికి తెర పడాలంటే... నదిని ఒక వ్యక్తిగా పరిగణించాలి. ఆ నదికి వున్న హక్కుల్ని గుర్తించి, వాటిని కాపాడే చర్యలు తీసుకోవాలన్న ఉద్యమం జరగాలి.










