నైపుణ్యంతో ఉన్నత ఉద్యోగాలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి చేరాలంటే నైపుణ్యం అవసరమని, అప్పుడే పనిచేసే చోట ఉన్నతస్థాయికి చేరేందుకు అవకాశముంటుందని, ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యంపై శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాలలో తొలుత స్కిల్ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జాబ్‌మేళాకు వచ్చే నిరుద్యోగ యువత కొందరు ఇంటర్య్వూలకు హాజరయ్యే సమయంలో జీతం తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారని, జీవితంలో ప్రతి ఒక్కటి ఆరంభంలో తక్కువే ఉంటుందని, మీ నైపుణ్యం చూపితే కంపెనీలే మీరు కొరినంత జీతం ఇచ్చేందుకు ముందుకు వస్తాయని వివరించారు. జపాన్ లాంటి దేశాల్లో కంపెనీల్లో 80 శాతం మంది నైపుణ్యంతోనే అతి తక్కువ జీతం నుండి అతి ఎక్కువ జీతానికి పనిచేస్తుంటారని, భారతదేశంలో కూడా 60 శాతం ఇలాగే జరుగుతుందని, నిరుద్యోగ యువత తొలుత ఉద్యోగంలో చేరి నైపుణ్యం సంపాదించుకుంటే పరిశ్రమ తప్పక మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా పరిశ్రమ ఏర్పాటు కానుందని, దీని ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి తప్పక సాధిస్తుందని వివరించారు. ఈ ప్రాంత యువత రానున్న పరిశ్రమలకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చన్నారు. అనంతరం జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతతో మాట్లాడారు. వారందరిని ప్రోత్సహిస్తూ ప్రతిఒక్కరూ ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. కాగా శనివారం జరిగిన జాబ్ మేళాకు 19 కంపెనీలు ఇంటర్య్వూలు నిర్వహించగా 778 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. వారిలో 315 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కాగా 121 షార్ట్ లిస్ట్ చేసినట్లు వివరించారు. డిఎస్‌డిఒ విజయ వినీల్ కుమార్, సీడెప్ జిడిఎం హైమావతి, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, ఎపిఎస్‌ఎస్‌డిసి, సిడెప్ ఉద్యోగులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ శివకోటరెడ్డి, స్కిల్‌హబ్ కేంద్ర నిర్వాహకులు విజరు, వినరుకుమార్ రెడ్డి, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, హెచ్‌ఒడి వెంకట రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










