వివిధ రంగాలకు చెందిన నైపుణ్య కార్మికుల (స్కిల్ లేబర్)ను తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైన విధానం ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో నైపుణ్య శ్రామికులను తయారు చేసేందుకు నియోజకవర్గానికి ఒక ఐటిఐ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అయితే, ఐటిఐలను ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోతుందా అన్నది కీలకమైన ప్రశ్న! నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఐటిఐల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వాటిని అప్‌గ్రేడ్ చేయడం, ఆధునీకరించడంపై ప్రభుత్వ దృష్టి అంతంతమాత్రమే! వీటిలో ఇప్పటికీ సాంప్రదాయ కోర్సుల బోధనకే ప్రాధాన్యత లభిస్తోంది. నూతన పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కోర్సుల రూపకల్పన జరగడం లేదు. ఇది చాలదన్నట్లు ఇన్‌స్ట్రక్టర్ల సమస్య వెంటాడుతోంది. డిమాండ్ లేని కోర్సులంటూ రిటైరైన వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయడం మాని వేసి చాలా సంవత్సరాలైంది. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరాన్ని, పరిశ్రమల అవసరాల మేరకు కొత్త కోర్సులను రూపొందించి, వాటికి బోధకులను నియమించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించిందా? ఈ విషయమై స్పష్టత లేదు. అసలు ఏ రంగంలోనైనా విద్యార్ధులు అభివృద్ధి చెందాలంటే హైస్కూళ్లలోనే పునాదులు పడాలి కదా! విద్యార్థుల మేథస్సు వికసించడానికి, వారి జిజ్ఞాసను పెంచడానికి అవసరమైన ల్యాబ్‌లు, లైబ్రరీలు హైస్కూళ్లలో ఎక్కడున్నాయి? అవే లేనప్పుడు వాటిని నిర్వహించే సిబ్బంది ఎక్కడుంటారు?
పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా టీచింగ్ స్టాఫ్‌పై పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి సరైన ప్రమాణాలతో, మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ బోధన జరగాలి. దానికి తగ్గట్టుగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధనలు కూడా మన రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులకు ప్రాధాన్యత ఇచ్చి జరపాలి. అటువటి ఆవిష్కరణలు మన రాష్ట్రంలో జరిగిన దాఖలాలు దాదాపు లేవు. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న ప్రైవేటు రంగం ఈ అంశాన్ని పట్టించుకోదు. పూర్తిస్థాయి ల్యాబులు ఉన్న ప్రైవేటు కళాశాలలు అరుదు. ప్రైవేటు రంగం పట్టించుకోక, ప్రభుత్వ రంగంలో వసతులు లేక పరిశోధనలు నీరుగారితే దాని దుష్ఫలితం పడేది భావితరాలపైనే. కీలకమైన ఈ అంశాలను నిర్లక్ష్యం చేసి నైపుణ్య అభివృద్ధి గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం శూన్యం. ఇంతే కాదు, వైద్య ఆరోగ్యం, టూరిజం, హాస్పిటాలిటీ, లీగల్ సర్వీసెస్ ఇలా చెప్పుకుంటూ పొతే కొత్తగా విస్తరిస్తున్న అనేక రంగాల్లో అందివస్తున్న అవకాశాలకు తగ్గట్టుగా నైపుణ్య వనరులను పెంపొందించడంపై దృష్టి సారించాల్సి ఉంది.
కరోనా వ్యాప్తికి ముందు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ 2022 నాటికి రాష్ట్రంలో 21 లక్షల మంది నైపుణ్యం లేని పనివారు ఉంటారని అంచనా వేసింది. వారందరికీ వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించింది. కరోనా ఉధృతి తరువాత ఈ లెక్కలు గణనీయంగా మారాయి. అనేకమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది. ట్రిపుల్ ఐ.టి చేసి, అందుకోసం అప్పులపాలై ఉద్యోగం రాక ఉప్పర వీరాంజనేయులు (25) అనే యువకుడు నిరాశతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ దుస్సంఘటన ఇటీవల కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నిజానికి ఇటీవల కాలంలో డిప్లొమా హోల్డర్లు, ఇంజినీరింగ్ పట్టభద్రులు ఎంతోమంది జోమోటో డెలివరీ బార్సుగా పని చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వీరందరికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ దిశలో ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తోందా? నైపుణ్య కార్మికులను తయారుచేసి చేతులు దులుపుకుంటుందా? చూడాల్సి ఉంది. మరో కీలకాంశం కూడా ఇటీవల కాలంలో ముందుకు వస్తోంది. ప్రైవేటు రంగం ఉద్దేశ్యపూర్వకంగానే ఎస్.సి., ఎస్‌టీలకు ఉపాధి అవకాశాలను తిరస్కరిస్తోంది. దీనికి వారు చెప్పే కారణాలు ఎలా ఉన్నప్పటికీ సామాజిక న్యాయం ప్రశ్నార్ధకంగా మారుతోంది. దీనిని సరిచేసేందుకు ప్రభుత్వం ఏం చేయనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తేగాని స్కిల్డ్ లేబర్ లక్ష్యం నెరవేరదు.










