Aug 11,2023 21:04

మహిళా సంఘసభ్యులను చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం :  మహిళా సంఘ సభ్యులు వ్యాపార నైపుణ్యాలు మెరుగుపరుచుకొని ఎక్కువ లాభాలను ఆర్జించాలని జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం కోనసీమ జిల్లా అమలాపురం నుండి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన వై.ఎస్‌.ఆర్‌. సున్నా వడ్డీ నాలుగవ విడత కార్యక్రమానికి కలెక్టరు కార్యాలయం నుండి జిల్లాకలెక్టరు నిశాంత్‌ కుమార్‌, లబ్దిదారులు వర్చువల్‌గా హాజరైనారు. జిల్లాలో 20,223 పొదుపు సంఘాల్లో 2,34,256 లక్షల రుణ ఖాతాలకు రూ.23.18 కోట్ల రూపాయల వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ చెక్కును లబ్దిదారులకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వారి వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకోవాలని తెలిపారు. సంఘాలు ఏర్పాటు చేసుకొనే చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా, వడ్డీ భారం లేకుండా నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికి వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల సభ్యులను వారు చేస్తున్న వ్యాపారాలను గూర్చి అడిగి తెలుసుకొని, నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకొని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గి, లాభాలు పెరుగుతాయని తెలిపారు. పొదుపు సంఘాల సభ్యులు వ్యాపారాలు నిర్వహించుకొనేందుకు కావాల్సిన నైపుణ్యాల కొరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తున్న లక్ష్మీనారాయణపురం నకు చెందిన అల్లు రమాదేవి, కురుపాం మండలం పి.రేవిడికి చెందిన ఆరిక శాంతకుమారి, వీరఘట్టం మండలానికి చెందిన చిదిమి గ్రామానికి చెందిన పెరుమళ్ల సుజాత తమ వ్యాపారాలకు సంబంధించిన అనుభవాలను కలెక్టరుకు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌కుమార్‌, ఎపిడి సత్యంనాయుడు, లబ్దిదారులు పాల్గొన్నారు.