Aug 17,2022 00:06

సదస్సులో ప్రసంగిస్తున్న వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : నైపుణ్యాలతో యువతను సుసంపన్నం చేయాలని ఎయు వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ రసాయనశాస్త్ర విభాగం సమావేశ మందిరంలో ఏయూ, సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, ఎన్‌సిఇఆర్‌టి సంయుక్తంగా నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాఠశాల స్థాయినుంచి నైపుణ్యాలు, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేటి సమాజం మార్కులు కొలమానంగా మారిపోయిందని, అభ్యసనంలో ఆనందం పొందే విధానం ఉండాలన్నారు.
సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య టివి కట్టిమణి మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థికి ఉపయుక్తంగా ఉండాలని పేర్కొన్నారు. సమాజం కేంద్రంగా చేసుకునే విద్యను అందించాలన్నారు. ఆర్‌ఐఇ, ఎన్‌సిఇఆర్‌టి మైసూరు ప్రిన్సిపల్‌ ఆచార్య వై.శ్రీకాంత్‌ మాట్లాడుతూ, విద్యలో నాణ్యత పెంపొందించడం ఎంతో ప్రధానమన్నారు. గ్లోబల్‌ సిటిజన్స్‌గా నేటి తరాన్ని తయారుచేయాలని, దీనికి అవసరమైన నైపుణ్యాలు, సామర్ధ్యాలు వారిలో పెంపొందించడం అవసరమని పేర్కొన్నారు.