Oct 29,2023 23:43

శిక్షణ ఇస్తున్న అధికారులు

ప్రజాశక్తి - గోపాలపురం
సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణతో, పారదర్శకతతో పనిచేయాలని పిఆర్‌ ఎస్‌ఇ ఎబివి.ప్రసాద్‌ సూచించారు. ఆదివారం గోపాలపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో పనిచేస్తున్న 44 మంది సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్లకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులు మూడు రోజులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ మాట్లాడుతూ అసిస్టెంట్లు తమ పరిధిలో మంజూరైన భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. నూతన నిర్మాణాలకు పూర్తిస్థాయి రేట్లు, వాటికి అవసరమైన మెటీరియల్‌ ఎస్టిమేషన్‌ వేసేందుకు, నిర్మాణాలు, బిల్లుల తయారీ వంటివి తెలుసుకునేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అదేవిధంగా సబ్‌ డివిజన్‌ పరిధిలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్లలో సచివాలయ బిల్డింగ్‌, ఆర్‌బికెలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్లు ఎన్ని ఉన్నాయో, వాటి నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో పిఆర్‌ డిఇ కె.బాలకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్‌ ఎఇ మురళీకష్ణ, గోపాలపురం పిఆర్‌ ఎఇ పవన్‌కుమార్‌, నల్లజర్ల టిఆర్‌ఎస్‌ వినోద్‌ కుమార్‌, మూడు మండలాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.