Nov 01,2022 21:17

స్కిల్‌ హబ్‌ను ప్రారంభించిన ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు
ప్రజాశక్తి - నూజివీడు

              ఎక్కడా లేని విధంగా ఉన్నత విద్య నూజివీడు ప్రాంతంలోనే చారిత్రాత్మకంగా అభివృద్ధి సాధించి, ఉపాధి అవకాశాలకు పుట్టినిల్లుగా మారుతోందని ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అన్నారు. పట్టణంలోని శ్రీ శోభనాచల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం ఆవరణంలో స్కిల్‌ హబ్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ ప్రతాప్‌ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు మద్రాసులో ఉన్నత విద్యలు కొనసాగేవన్నారు. విజయవాడలో కూడా విద్య అవకాశం లేని రోజుల్లో డాక్టర్‌ ఎంఆర్‌ అప్పారావు, పూర్వీకులు నూజివీడులో ఉన్నత విద్య అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. విజయవాడలో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్‌అండ్‌ సివిఆర్‌ కళాశాల నూజివీడు వారు అందించిన విద్యగా నేటి తరంలో చాలామందికి తెలియదన్నారు. విజయవాడలో సువిశాలమైన ప్రాంగణం తో పాటు భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఉన్నత విద్యలకు నిలయంగా ఉన్న నూజివీడు పట్టణంలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేయడంతో నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పగడాల సత్యనారాయణ, కలగర్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.