Dec 21,2022 22:30

రాత్రుల్లో తెరిచి ఉన్న 'బార్‌'

బహిరంగంగానే అర్థరాత్రి వరకూ అమ్మకాలు
ప్రజాశక్తి - నాయుడుపేట

'డబ్బుండాలే గానీ నాయుడుపేటలో మందుకు కొదవ లేదు' అంటున్నారు నాయుడు పేట లోని మందుబాబులు. అర్ధరాత్రే కాదు రోజంతా ఎపుడైనా సరే మందుబాబులకు ఇబ్బంది రాకుండా ఎక్సైజ్‌ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ సమయంతో పని ఉండదు.. సిబ్బంది 24 గంటలూ షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తారు. ఈ 'బార్‌' నాయుడుపేట అంటే కోర్టు, డిఎస్‌పి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే.. అంటే న్యాయం, ధర్మం సమపాళ్లలో ఉండేచోటనే.. సమయంతో పని లేకుండా, నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నా వీరికి పట్టదు. ఉదయం ఏడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకూ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. 'నిషా' మత్తులో మందుబాబులు ఉంటే, పోలీసు అధికారులు ఏ 'నిషా'లో ఉన్నారో అర్ధం కావడం లేదని బహిరంగంగానే స్థానికులు నవ్వుకునే పరిస్థితి. మందుబాబులు మద్యం బహిరంగ ప్రదేశాల్లో సేవించుకుంటూ చిన్న చిన్న కూల్‌డ్రింక్‌ షాపులపై, డాబా హోటళ్ల వద్ద అపుడపుడు తనిఖీలు చేసే అధికారులకు ఇంత పెద్ద 'బార్‌' కనిపించడం లేదా? అని విమర్శిస్తున్నారు. ఈ బార్‌ వెనక 'అధికార పార్టీ' కీలక పాత్ర వల్లనే ఎవరూ ఏమి చేయలేని పరిస్థితన్నది వాస్తవం. బార్‌ నిర్వహణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ బార్‌ నిర్వహించాలి. కానీ వీరు ఉదయం ఏడు గంటల నుంచి అమ్మకాలు మొదలు పెడతారు. తెల్లవారుజామున మూడు గంటలకు మూసేస్తారు. బార్‌కు సమీపంలనే ఆర్టీసీ బస్టాండ్‌ ఉండడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బంఇ పడే పరిస్థితి. అర్ధరాత్రి అమ్మకాల వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజాసంఘాల నాయకులు ఘాటుగానే విమర్శిస్తున్నారు. అయినా అధికార యంత్రాంగానికి పట్టదాయే.