Aug 19,2023 00:38

నాయుడుపేట హైస్కూల్లో వెట్టిచాకిరి
ప్రజాశక్తి - నాయుడుపేట
నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించుకోవడం విమర్శలకు తావిచ్చింది. తన హవా ప్రదర్శించేందుకు విద్యార్థులతో పనిచేయిస్తూ, అడిగితే పొంతనలేని సమాధానాలిస్తున్నారు. ఈ విషయాన్ని ఖండించాల్సిన ప్రధానోపాధ్యాయులు సైతం ఆ ఉపాధ్యాయునికి వత్తాసు పలకడం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం నాయుడుపేటలోని జడ్‌పి బార్సు హాస్టల్లో స్కూలు సమయంలో ఆ స్కూల్లోని ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్న ఎం.నాగరాజు కొంతమంది స్కూలు పిల్లలతో ఇటుకరాళ్లు మోయించడం, గుంతలు తీయించడం వంటి కూలి పనులు చేయించారు. ఈ విషయమై ఆ ఉపాధ్యాయుని 'ప్రజాశక్తి' వివరణ కోరగా ఇక్కడ దిగేందుకు ఎక్కేందుకు ఇబ్బందిగా ఉందని, నడిచే సమయంలో స్కూలు సిబ్బంది, విద్యార్థులు జారిపడే అవకాశం ఉందని, తన సొంత ఖర్చులతో వీటిని బాగు చేయిస్తున్నానని చెప్పారు. పిఇటి సమయంలో విద్యార్థులు ఆకతాయిగా తిరగకుండా వాళ్లతో శ్రమదానం చేయించామని సమాధానం ఇచ్చారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు స్పందిస్తూ పిల్లలతోపని చేయించడం నిజమేనని, స్కూలు బాగు కోసమే చేయించామని వంతపాడారు. ఇలాంటి పనులు చేయించే సందర్భంలో పిల్లలకు ఏదైనా ప్రమాదాలు వాటిల్లితే బాధ్యత ఎవరిదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్‌కృష్ణ ప్రశ్నించారు. అధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.