Oct 17,2023 15:47

ఘనంగా 103వ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం


ప్రజాశక్తి - చింతలపూడి :    భారతదేశంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆవిర్భావానికి కృషి చేసినటువంటి నాయకుల త్యాగాలు మరువ లేనివని చింతలపూడి మండల సిపిఐ కన్వీనర్‌ ఆర్‌వియస్‌ నారాయణ తెలిపారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అవిర్భవించి 103 సంవత్సరాలు అయిన సందర్భంగా చింతలపూడిలో సిపిఎం ఆఫీస్‌ వద్ద జెండా ఎగురువేసి, 103 సంవత్సరాల కమ్యూనిస్టు చరిత్రను వివరించారు. అనంతరం పార్టీ పతాకాన్ని పట్టణ శాఖ కార్యదర్శి యస్‌.సూర్యకుమార్‌ ఆవిష్కరించి, నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవానికి కృషి చేసిన నాయకులను ఆదర్శంగా తీసుకుని, కార్మిక, కర్షక, మహిళల హక్కులకై నిరంతరం వారి వారసులు స్వచ్ఛందంగా పోరాడుతున్నారని తెలిపారు. అధికారం ఉన్నా, లేకపోయినా నిజాయితీగా పోరాడే కమ్యూనిస్టులకు ప్రజలంతా నైతిక బలం చేకూర్చి, భారతదేశంలో కార్మిక రాజ్యం తీసుకురావాలని కోరారు. అనంతరం పట్టణ నాయకులు సూర్య కుమార్‌ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని కమ్యూనిస్టు పార్టీలు కోరుకుంటుంటే నేడు మతోన్మాద శక్తులు ప్రజలను మతాలు, కులాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటానికి సెక్యులర్‌ శక్తులు, అభ్యుదయవాదుల మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.సత్యనారాయణ, యస్‌.జోషి, యం.వరలక్ష్మి దేవి, కె.అనురాధ, ఎ.రాహుల్‌, పి.రంగయ్య పాల్గొన్నారు.