Aug 28,2023 22:03

కలెక్టరేట్‌ వద్ద కెవిపిఎస్‌, ఎస్‌ఎప్‌ఐ ఆధ్వర్యాన ధర్నా
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

కామవరపుకోటలో నివసిస్తున్న నాయక్‌ కులస్తులకు ఎస్‌టి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ వందలాది మంది ఏలూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద కెవిపిఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆడపిల్లలు మోకాళ్లపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌, నాయకులు మంచెల్ల ఇస్సాకు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌ మాట్లాడుతూ మండల కేంద్రం కామవరపుకోటలో సుమారు 300 కుటుంబాలు నాయక్‌ కులస్తులు తరతరాలుగా ఇక్కడే జీవిస్తున్నారని తెలిపారు. వీరికి గత ప్రభుత్వ హయాం వరకూ ఎస్‌టిలుగా కుల ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం ఇచ్చేదని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టి గత ప్రభుత్వాలు ఎస్‌టిలుగా గుర్తించిన వారిని నేడు గుర్తించడానికి నిరాకరిస్తుందని విమర్శించారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని తెలిపారు. నాయక్‌ కులస్తులను ఎస్‌టిలుగా గతంలో మాదిరిగానే గుర్తించి వారి విద్యా, ఉపాధి అవకాశాలకు లబ్ధి చేకూరే విధంగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్‌, యశ్వంత్‌, కెవిపిఎస్‌ ఏలూరు సిటీ నాయకులు బాలరాజు, నాయక్‌ కుల పెద్దలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు వినతిపత్రం సమర్పించారు.