ప్రజాశక్తి - ఆదోని
అన్య కులస్తులు ఏర్పాటు చేసిన సెలూన్లను తొలగించాలని కోరుతూ ఆదోనిలో నాయీ బ్రాహ్మణులు భారీ ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని అనంత మంగళ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మున్సిపల్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి మహాత్మ గాంధీ, బిఆర్.అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు గౌడ్ ఈరన్న, గౌరవాధ్యక్షులు రంగస్వామి మాట్లాడారు. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో మంగళి కులస్తులు కాకుండా ఇతరులు సెలూన్ షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. షాపులను తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రాలయం : ఆదోనిలో చేపడుతున్న నాయీ బ్రాహ్మణుల నిరసనకు మంత్రాలయం నాయీ బ్రాహ్మణులు సంఘీభావం తెలిపి తమ సెలూన్ దుకాణాలను మూసి వేశారు. ఆదోని నాయీ బ్రాహ్మణులు నిరసన దీక్షకు మంత్రాలయం నుంచి వెళ్లి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు.
ప్రదర్శన నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు










