2,500 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
ప్రజాశక్తి-కొయ్యూరు
ఆపరేషన్ పరివర్తనలో కార్యక్రమంలో భాగంగా నాటుసారా స్థావరాలపై కొయ్యూరు పోలీస్ సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించి 2,500 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్సై రాజారావు, సిబ్బంది, ఏపీఎస్పీ, మహిళా పోలీసులతో కలిసి నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మండలంలోని కొప్పుకొండ గ్రామ శివారులో నాటు సారా తయారీ జరుగుతుందని ముందస్తు సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 2,500 లీటర్ల బెల్లం పులుపును వంట సామాగ్రిని డ్రమ్ములను ధ్వంసం చేశారు. అనంతరం ఆయా గ్రామాల గిరిజనులతో సమావేశమైన పోలీసులు నాటుసారా వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. నాటు సారా తయారీ క్రయవిక్రయాలు చట్ట వ్యతిరేకమని అటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్ట ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడునని తెలిపారు.










