ప్రజాశక్తి-అనకాపల్లి
నాటు సారాను అరికట్టేందుకు నాటు సారా తయారీ, విక్రయాన్ని వదులుకున్న వారికి పరివర్తన పథకం రెండులో భాగంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి చేతుల మీదుగా సోమవారం అందజేశారు. జిల్లాలోని 67 మంది ఎస్‌హెచ్‌జి సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా రూ.31.50 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకంలో అక్రమంగా నాటు సారా తయారీని అరికట్టేందుకు పోలీస్ శాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సహకారంతో పనిచేస్తుందని చెప్పారు. ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉపాధి లేక అక్రమంగా నాటు సారా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. సంఘంలో మంచి నడవడికతో గౌరవం వచ్చేలా మారిన వారికి వారి అభిరుచిను బట్టి స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి, అడిషనల్ ఎస్పీ బి విజయభాస్కర్, డిఆర్డిఏ పిడి లక్ష్మీపతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డిఆర్డిఏ ఏపీవోలు పాల్గొన్నారు.










