పెట్టుబడులు కూడా రాని పరిస్థితి
తడిసిపోవడంతో సగానికి పైగా తగ్గిన ధర
ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలి : రైతుల డిమాండ్
ప్రజాశక్తి - ముసునూరు
గత 15 రోజులుగా తరచూ కురుస్తున్న అకాలవర్షం నాటుపొగాకు రైతులను నట్టేట ముంచింది. వారిని కోలుకోలేని దెబ్బతీసింది. సాధారణంగా నాటుపొగాకు తడిస్తే ఆ రైతు తీవ్రనష్టం చవిచూసినట్లే. తడిసిన పొగాకు ధర సగానికి సంగం పడిపోతుంది. ముఖ్యంగా ముసునూరు మండలం అంటేనే నాటుపొగాకుకు పెట్టిందిపేరు. గత 50 ఏళ్ల నుంచి మండలంలోని ముసునూరు, గోపవరం, గోగులంపాడు, కాట్రేనిపాడు, వేల్పుచర్ల, గుళ్లపూడి తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో రైతులు నాటు పొగాకు సాగుచేస్తున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో నాట్లు వేసి ఫిబ్రవరి, మార్చి నెలలో కోత కోస్తారు. కోత సమయంలో వర్షం పడితే సగం ధర తగ్గిపోయినట్లే. ముసునూరు మండలం మెట్టప్రదేశం కాబట్టి బోరుబోవుల ద్వారా పొగాకు పంటకు నీళ్లు పెట్టాలి. ఎకరం, అర ఎకరం రైతులందరూ కలిసి బోరు వేసుకుని పంట సాగుచేస్తారు. వంతుల విధానంలో పంటకు తడులు వేస్తుంటారు. నీరు తక్కువైనా సరిపెట్టుకునే పంట కావడంతో అధిక సంఖ్యలో రైతులు నాటుపొగాకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది సుమారు 600 ఎకరాల్లో నాటుపొగాకు సాగుచేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరుకుంది. చాలాచోట్ల పొగాకు పందిళ్లు వేసి ఎండబెట్టారు. ఈ క్రమంలో 15 రోజులుగా తరచూ కురుస్తున్న వర్షానికి పొగాకు పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధర సగం పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోగాకు తడవకపోతో మార్కెట్‌లో కిలో సుమారు రూ.250 వరకూ వస్తుందని, తడిసిపోవడంతో కిలో రూ.వంద నుంచి రూ.150 వరకు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష వరకూ నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఎకరాకు రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టామని, కనీసం రూ.70 వేల నుంచి రూ.80 వేలు కూడా వచ్చే అవకాశం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా ఎకరాకు సుమారు ఆరువేల కేజీల వరకూ దిగుబడి వచ్చిందని, కానీ అకాల వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని పలువురు వాపోతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దళారులు రైతులను మరింత దోచుకుంటున్నారని, పొగాకు వ్యాపారులు సిండికేట్ అయ్యి రేటు పెరగకుండా చేస్తున్నారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయినకాడికి పొగాకు అమ్ముకోవాల్సి వస్తుందని పలువురురైతులు చెబుతున్నారు.










