ప్రజాశక్తి- పెదబయలు :అడవి పంది వేటకు అడవికి వెళ్లిన బృందం సభ్యుల్లో ఒకరు ప్రమాదవశాత్తు నాటుతుపాకి పేలడంతో మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. పెదబయలు మండలం వనుకొంతూరు కొండల్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జి.మాడుగుల మండలం మారుమూల కిల్లంకోట పంచాయతీ కప్పలు గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళుతున్న క్రమంలో బుటారి బొంజుబాబుకు అడవి పంది అడుగు జాడలు కనిపించాయి. అడవి పంది అడుగు జాడలు చూస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో వెనుక ఉన్న ఎండ్రపల్లి సూరిబాబు చేతిలోని నాటు తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో బుటారి బొంజుబాబు శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జి.మాడుగుల సిఐ సత్యనారాయణ, ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. నాటుతుపాకి స్వాధీనం చేసుకొని, వేటకు వెళ్లిన మరో నలుగురు బుటారి మాలన్న, వెంబరి సుబ్బారావు, బుటారి సింహాచలం, ఎండ్రపల్లి సూరిబాబులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జి.మాడుగుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుటారి బొంజుబాబు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.










