3వేల లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
ప్రజాశక్తి-కొయ్యూరు
ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా పోలీసులు నాటుసారా స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించి మూడు వేల లీటర్ల బెల్లం పులుపును, 20 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్సై రాజారావు, సిబ్బంది ఏపీఎస్పీ, మహిళా పోలీసులు మండలంలోని సురేంద్రపాలెం గ్రామ శివారులో నాటుసారా తయారీ, క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 3వేల లీటర్ల బెల్లం పులుపును, వంట సామాగ్రిని డ్రమ్ములను ధ్వంసం చేశారు. అనంతరం ఆయా గ్రామాల గిరిజనులతో సమావేశమై పోలీసులు నాటుసారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. నాటు సారా తయారీ క్రయవిక్రయాలు చట్ట వ్యతిరేకమని, అటువంటి చర్యలకు ఎవరు పాల్పడితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు. ఇకపై నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.










