Jul 19,2023 22:15

ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం క్యాన్లు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌: ఎన్ఫోర్స్మెంట్‌ ఇన్స్పెక్టర్‌ ఎల్‌.ఉపేంద్ర ఆధ్వర్యంలో ఒడిషా నుంచి ఆంధ్రా ప్రాంతానికి నాటుసారా రవాణా జరుగుతుందన్న సమాచారంతో మండలంలోని కొత్తూరు సమీపంలో కొండ మార్గాన వస్తున్న నాటుసారా క్యాన్లతో ఉన్న సైకిళ్లను వెంబడించగా కొంత దూరంలో తమ సిబ్బందిని చూసి సారాను విడిచిపెట్టి నిందితులు పారిపోయారు. దీంతో ఏడు సైకిళ్లను సీజ్‌ చేసి 320 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాకు చెందిన నాటు సారా సరఫరాదారులు ఉయక సుబ్బు, ఉయక మల్లేసుపై కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు. అలాగే పార్వతీపురం పట్టణానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో ఎస్‌ఐ రమణ, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.
2300 లీటర్ల నాటు సారా ధ్వంసం
జిల్లా స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత రెండు నెలలలో 50 కేసుల్లో పట్టుబడి, సీజ్‌ చేసిన 2300 లీటర్ల నాటుసారాను మంగళవారం రాత్రి పట్టణ శివారులో గల నవిరి కాలనీ సమీపంలో పాత తోటపల్లి రోడ్డులో ఎన్ఫోర్స్మెంట్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.సుధాకర్‌ ఆధ్వర్యంలో ధ్వంసం చేసినట్టు సిఐ ఎల్‌.ఉపేంద్ర విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇబి సిబ్బంది పాల్గొన్నారు.