
ప్రజాశక్తి - నిజాంపట్నం
ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు రేపల్లె డీఎస్పీ టి మురళి కృష్ణ సూచనలతో రేపల్లె టౌన్, రూరల్ సీఐలు ఎం నజీర్ బేగ్, ఏ శివశంకర్ ఆధ్వర్యంలో అడవులదీవి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిండి పంచాయతీ అదవల గ్రామంలో సోమవారం కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గతంలో నాటు సారా తయారు చేసిన ప్రదేశాలతో పాటుగా అనుమానితుల గృహాలను, ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అదవల గ్రామం వెలుపల అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేస్తున్న బట్టీలను ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేసిన, అక్రమ రవాణా చేసిన, నిల్వవుంచిన, విక్రయించినా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై పీడీ చట్టం ప్రయోగించడానికి వెనుకాడబోమని చెప్పారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు గమనిస్తే డయల్ 100, 112లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచార అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాని ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో నగరం సెబ్ సీఐ డి.శ్రీనివాసరావు, ఎస్ఐలు ఎస్ వెంకటరవి, వై సురేష్, డి రామకృష్ణ, కె శివప్రసాదరావు, జె నాగరాజు పాల్గొన్నారు.